యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే కేవలం ఒక పేరు కాదు.. అది ఒక ఎమోషన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, తాజాగా బెంగళూరు వీధుల్లో కనిపించిన దృశ్యాలు చూస్తుంటే తారక్ ఇమేజ్ ఇప్పుడు సరిహద్దులు దాటి విశ్వవ్యాప్తమైందని స్పష్టమవుతోంది. `ఆర్ఆర్ఆర్` తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్, తాజాగా కర్ణాటక రాజధానిలో చేసిన సందడి సోషల్ మీడియాను ఊపేస్తోంది.
బెంగళూరులోని కిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తారక్ వస్తున్నారన్న వార్త ఒకరోజు ముందే తెలియడంతో, ఆదివారం ఉదయం నుంచే అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. హాస్పిటల్‌కు వెళ్లే దారులన్నీ కిలోమీటర్ల మేర అభిమానులతో నిండిపోయాయి. ఎన్టీఆర్ రాకతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కన్నడ గడ్డపై `సీఎం సీఎం`.. `బాబులకే బాబు` అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలు మిన్నంటాయి. ఈ రేంజ్ మాస్ ఫాలోయింగ్ చూసి స్థానిక నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.
ఎన్టీఆర్ కారు దిగి లోపలికి వెళ్లే క్రమంలో అభిమానులు ఒక్కసారిగా మీదకు రావడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. అభిమానుల తాకిడికి తట్టుకోలేక అక్కడి ఎస్కలేటర్ అద్దాలు సైతం పగిలిపోయాయి. సెక్యూరిటీ సిబ్బంది ఎంత ప్రయత్నించినా జనాలను నియంత్రించడం కష్టతరంగా మారింది. పరిస్థితిని గమనించిన తారక్, తిరిగి వెళ్లే సమయంలో తన కోసం గంటల తరబడి వేచి ఉన్న ఫ్యాన్స్ నిరాశ చెందకూడదని కారు టాప్ పైకి ఎక్కి అభివాదం చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
కాగా, చాలా కాలంగా ఎన్టీఆర్ మీడియా కంటికి చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. దానికి కారణం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `డ్రాగన్` సినిమా కోసం ఆయన చేస్తున్న మేకోవర్. గతంలో కాస్త బక్కగా కనిపించిన తారక్, ఇప్పుడు ఈ కొత్త లుక్‌లో ఎంతో ఎనర్జిటిక్‌గా, షార్ప్‌గా కనిపిస్తున్నారు. ఆరు నెలల గ్యాప్ తర్వాత తన హీరోను ఇలా కొత్త అవతారంలో చూడటంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.