అసెంబ్లీకి వెళ్లడానికి సిద్ధంకండి.. మ‌హిళ‌ల‌కు బాబు బంప‌ర్ ఆఫ‌ర్!

admin
Published by Admin — March 09, 2026 in Politics, Andhra
News Image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మహిళా లోకానికి ఒక అదిరిపోయే పిలుపునిచ్చారు. మహిళలు కేవలం ఓటర్లుగానే కాదు, శాసనకర్తలుగా కూడా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. త్వరలోనే చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలులోకి రాబోతున్నాయని, ఆ లోపు మహిళలందరూ రాజకీయాల్లోకి వచ్చేందుకు, ఎమ్మెల్యేలుగా బాధ్యతలు చేపట్టేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

కేవలం వంటింటికే పరిమితం కాకుండా, సమాజ గమనాన్ని మార్చే శక్తి మహిళలకు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మహిళల పాత్ర అత్యంత కీలకం కాబోతోందని, చట్టసభల్లో పెరగబోయే మహిళా ప్రాతినిధ్యం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని, ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

రాజకీయాలతో పాటు ఆర్థికంగా కూడా మహిళలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ఏడాదిలో ఏకంగా 5 లక్షల మంది మహిళలను చిన్నతరహా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం ప్రకటించారు. మహిళలు కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారు కాకుండా, పదుల సంఖ్యలో ఉద్యోగాలిచ్చే సంపద సృష్టికర్తలుగా మారాలని ఆయన ఆకాంక్షించారు.

మహిళల భద్రత, ఆరోగ్యం మరియు ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. `తల్లికి వందనం`, `దీపం-2`, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాల ద్వారా ఇప్పటికే మహిళలకు భరోసా కల్పించామని గుర్తు చేశారు. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఉచిత వ్యాక్సినేషన్ వంటి కీలక నిర్ణయాలతో మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.  

Tags
Chandrababu Naidu Womens Day 2026 Andhra Pradesh Women Empowerment AP Politics AP News
Recent Comments
Leave a Comment

Related News