మహిళలు ఆకాశంలో సగం కాదని.. నింగీ నేలా వారివేనని మంత్రి నారా లోకేశ్ (nara lokesh)అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(international women's day) సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు(wishes) తెలిపారు. మహిళలను గౌరవించాలనే నైతిక విలువలను తన తల్లి చిన్నప్పుడే నేర్పించారని గుర్తు చేసుకున్నారు. "అమ్మా.. నీవు ఆకాశంలో సగం కాదమ్మా.. నింగీ నేలా నీవే. ఈ సృష్టి మీది.. మా జన్మ మీది" అని లోకేశ్ అన్నారు. అమ్మ, భార్య, సోదరి, కుమార్తె, పిన్ని, మరదలు ఇలా ప్రతి రూపంలోనూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే మాతృమూర్తులందరికీ వందనాలు అని చెప్పారు.
తన తాత దివంగత ఎన్టీఆర్ ఆడపడుచులకు ఆస్తిహక్కు కల్పించారని, తన తండ్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాలతో మహిళా సాధికారతకు బాటలు వేశారని కొనియాడారు. 'స్త్రీ శక్తి', 'తల్లికి వందనం' వంటి పథకాలతో మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు.
మహిళల పట్ల భావితరాల వారిలో గౌరవం పెంచేందుకు విద్యావ్యవస్థలో కీలక మార్పులు చేశామన్నారు. నైతిక విలువల సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమించామని గుర్తు చేశారు. స్త్రీ, పురుషులను సమానంగా చూపే చిత్రాలను పాఠ్యపుస్తకాల్లో ముద్రించామన్నారు. "ఆడపిల్లలా ఏడవొద్దు", "గాజులు తొడుక్కోలేదు", "చీర గాజులు పంపిస్తా" వంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పేనని అన్నారు.