తెలుగు రాష్ట్రాల పేదల పాలిట కల్పవల్లి.. దశాబ్దాల నమ్మకానికి నిలువుటద్దం.. మన `విజయా` డైరీ. కానీ, గత వైసీపీ ప్రభుత్వ పుణ్యమా అని ఇప్పుడు ఈ విజయ బ్రాండ్ కాస్తా వివాదాల బ్రాండ్‌గా మారిపోయింది. టీటీడీ లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారం ఇంకా సెటిల్ అవ్వకముందే, ఇప్పుడు సాక్షాత్తూ ప్రభుత్వ డైరీలోనే ప్రైవేటు వ్యక్తుల దందా వెలుగులోకి రావడం విశేషం. బ్రాండ్ ఏమో మనది.. కానీ అందులో వచ్చే లాభం మాత్రం గుజరాత్ కంపెనీలది. ఇదెక్కడి విడ్డూరం సామీ అంటే.. ఇదే వైసీపీ మార్క్ రివర్స్ టెండరింగ్ అని విశ్లేషకులు నవ్వుకుంటున్నారు.
తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి బయటపెట్టిన నిజాలు చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మడం ఖాయం. ఏపీ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ పరిధిలో ఉన్న `విజయా` బ్రాండ్ వినియోగ హక్కులను నిబంధనలకు విరుద్ధంగా గుజరాత్‌కు చెందిన `మేఘనా ఫుడ్స్` వంటి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేశారట. అంటే షాపు మీద బోర్డు మనది.. లోపల సరుకు మాత్రం ఎవరిదో అన్నమాట. ఇంతకాలం విజయా నెయ్యి అంటే స్వచ్ఛతకు మారుపేరు అనుకున్నాం.. కానీ అందులో వెజిటేబుల్ ఆయిల్ కలిసిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్షల్లో తేలడం చూస్తుంటే, ప్రజారోగ్యంతో ఎంతగా ఆడుకున్నారో అర్థమవుతోంది.
ఇక అన్నిటికంటే పెద్ద హైలైట్ ఏంటంటే.. మార్కెట్లో దొరుకుతున్న పాలు, నెయ్యి ప్యాకెట్ల మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వచ్చే ట్విస్ట్. ఆ కోడ్ స్కాన్ చేస్తే ప్రభుత్వ డైరీ వివరాలు రావాలి కదా? కానీ అక్కడ కనిపిస్తున్నవి మాత్రం ప్రైవేటు కంపెనీల పేర్లు. అంటే ప్రభుత్వం చేసే పనిని ప్రైవేటు వాళ్లకి అప్పగించి, వాళ్ళు కల్తీలు చేస్తున్నా చూసీచూడనట్టు వదిలేశారన్నమాట. ఇదంతా చూస్తుంటే వైసీపీ హయాంలో ఒప్పందాలు ఏ స్థాయిలో జరిగాయో ఇట్టే అర్థమవుతోంది.
మొత్తానికి టీటీడీ పవిత్రతను దెబ్బతీశారన్న విమర్శలతో ఇరకాటంలో ఉన్న జగన్ పార్టీకి, ఇప్పుడు ఈ విజయా నెయ్యి సెగ గట్టిగానే తగిలేలా ఉంది. అటు ఏపీలో వైసీపీ, ఇటు తెలంగాణలో గత గులాబీ ప్రభుత్వం ఈ అడ్డగోలు ఒప్పందాలకు బాధ్యత వహించాల్సిందేనని అమిత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పాలల్లో నీళ్లు కలపడం పాత స్టైల్.. ఏకంగా బ్రాండ్‌నే ప్రైవేటు వాళ్లకి అప్పగించి కల్తీ చేయడం కొత్త స్టైల్. ఏదేమైనా తెలుగు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేసిన ఈ నెయ్యి దందా ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది.