కాలేజీ అమ్మాయిలకు ఫ్రీ స్కూటీ.. అర్హతలు ఇవే..!?

admin
Published by Admin — March 09, 2026 in Politics, Telangana
News Image

తెలంగాణలో కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే మహిళా దినోత్సవ కానుక ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, అర్హులైన విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరిగిన వేడుకల్లో సీఎం స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. 

ఎవరెవరు అర్హులు?
ఈ పథకం ప్రధానంగా 18 ఏళ్లు నిండి, ప్రస్తుతం ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థినులను ఉద్దేశించి రూపొందించారు. ముఖ్యంగా డిగ్రీ చదువుతున్న వారికి ఈ స్కీమ్ వర్తించే అవకాశం ఉంది. అయితే కేవలం ప్రభుత్వ కాలేజీల వారికేనా లేక ప్రైవేట్ కాలేజీ విద్యార్థినులకు కూడా ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం, క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్లే అటెండెన్స్ ఉన్న విద్యార్థినులకే ప్రాధాన్యత ఉండనుంద‌ని తెలుస్తోంది.

కావాల్సిన డాక్యుమెంట్లు ఇవేనా?
సాధారణంగా ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకానికైనా రేషన్ కార్డ్ ప్రామాణికంగా ఉంటుంది. వీటితో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ తరహాలోనే ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం వంటివి అడిగే అవకాశం ఉంది. స్కూటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండాలి కాబట్టి ఆధార్ కార్డ్ మరియు కాలేజీ ఐడి కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఈ ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

ఇక‌పోతే రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థినులు ఉండటంతో, అందరికీ ఒకేసారి స్కూటీలు ఇవ్వడం ఆర్థికంగా పెను భారం కానుంది. అందుకే తొలుత పైలెట్ ప్రాజెక్ట్‌గా కొన్ని జిల్లాల్లో ప్రారంభించి, ఆపై విడతల వారీగా రాష్ట్రమంతటా అమలు చేసే యోచనలో సర్కార్ ఉంది. కేంద్రం ఇచ్చే ఫేమ్-2  సబ్సిడీని వాడుకుంటూ, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఒక్కో విద్యార్థినికి సుమారు రూ. 50 వేల విలువైన ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags
Telangana Revanth Reddy Free Scooty Scheme Womens Day 2026 Electric Scooter Student Welfare
Recent Comments
Leave a Comment

Related News