పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట తీవ్ర రాజకీయ, రాజ్యాంగ దుమారం రేగింది. రాష్ట్రపతి పర్యటనలో చోటు చేసుకున్న `ప్రోటోకాల్ లోపం`.. అనంతరం జరిగిన పరిణామాలు.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు-బెంగాల్‌లోని మమతా బెనర్జీ(mamata benerjee) ప్రభుత్వానికి మధ్య తీవ్రస్థాయిలో పొలిటికల్ సమరాన్ని రేపేసింది. ``ఆదివాసీలకు ఇస్తున్న గౌరవం ఇదేనా?`` అంటూ ప్రధాని మోడీ మమత సర్కారుపై నిప్పులు చెరిగారు. అంతేకాదు..``మహిళగా కూడా రాష్ట్రపతిని మీరు గౌరవించలేక పోతున్నారు`` అని మండిపడ్డారు. ఇక, రాష్ట్రపతి ముర్ము(president murmu) కూడా.. ఈవిషయంపై వెంటనే రియాక్ట్ అయ్యారు.
గతానికి భిన్నంగా.. పర్యటన సమయంలోనే రాష్ట్రపతి బయటకు వచ్చి.. సాధారణ వ్యక్తిగా మైకు పుచ్చుకుని.. అధికారులను.. ప్రభుత్వాన్ని సైతం నిలదీశారు. ఇక, సీఎం మమతా బెనర్జీ సైతం.. ఈ విషయంలో తన వాదనను బలంగానే వినిపించారు. ``రాష్ట్రపతి.. రాష్ట్రపతిగా వచ్చి ఉంటే గౌరవం ఇచ్చేవాళ్లం.కానీ, ఆమె బీజేపీ ప్రతినిధిగా వచ్చారు.`` అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక, ఈ విషయంలోకి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎంటరయ్యారు. రాష్ట్రపతి స్థానాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్నవారిని గౌరవించడం ప్రతిఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు.
అసలు ఏం జరిగింది?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సంతాలీ సమాఖ్య సహా పలు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన 9వ అంతర్జాతీయ సంతాలీ సదస్సుకు హాజరయ్యారు. అయితే.. ప్రొటోకాల్ ప్రకారం.. రాష్ట్రపతిని స్వాగతించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అదేవిధంగా ఇతర మంత్రులు హాజరుకావాల్సి ఉంది. కానీ, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సహా ఇతర మంత్రులు విస్మరించారు. ఈ ఘటనపైనే రాజకీయ, రాజ్యాంగ దుమారం రేగింది.
అంతేకాదు.. డార్జిలింగ్‌లో ముందస్తుగా సిద్ధం చేసుకున్న రాష్ట్రపతి సభా స్థలిని కూడా అధికారులు అనూహ్యంగా మార్పు చేశారు. తొలుత బిదాన్‌నగర్‌లో సభ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. కానీ, రాష్ట్రపతి డార్జిలింగ్‌కు చేరుకున్న తర్వాత.. సభాస్థలిని అధికారులు మార్చేశారు. బిధాన్ నగర్ నుంచి గోసాయిపూర్‌కు మార్చారు. ఈ వ్యవహారంపై కూడా రాష్ట్రపతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను స్వాగతించేందుకు ముఖ్యమంత్రిగానీ, ఇతర మంత్రులుగానీ రాలేదని రాష్ట్రపతి ఆవెంటనే బయటకు వచ్చి చెప్పుకొచ్చారు.
అదేవిధంగా డార్జిలింగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశ స్థలిని కూడా ఇరుకుగా ఉందన్న కారణంతో చివరి నిమిషంలో మార్చివేయడం పట్ల కూడా రాష్ట్రపతి ముర్ము.. తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. తాను ఆ స్థలాన్ని చూశానని, అక్కడ 5 లక్షల మంది కూర్చోవచ్చని చెప్పారు. కానీ.. మమత ప్రభుత్వం చివరి నిమిషంలో సభా స్థలిని మార్చేయడం చాలా విచారకరమని వ్యాఖ్యానించారు. సమావేశాన్ని బిధాన్‌నగర్ నుంచి గోసాయిపూర్‌కు మార్చడాన్ని రాష్ట్రపతి తీవ్రంగా తప్పుబట్టారు.
మోడీ ఫైర్..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పశ్చిమ బెంగాల్ పర్యటనలో అక్కడి ప్రభుత్వం సభాస్థలిని మార్చి.. ఆమెను తీవ్ర అసంతృప్తికి గురిచేయడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(pm narendra modi) తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పరిణామాలు గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ప్రజాస్వామ్యం, ఆదివాసీల సాధికారితపై విశ్వాసం ఉన్నవారు నిరాశ చెందారని వ్యాఖ్యానించారు. ఆదివాసీ జాతికి చెందిన రాష్ట్రపతికి బాధ కలిగించడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్ని హద్దులను దాటిందని, రాష్ట్రపతిని అగౌరవ పరిచిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
చంద్రబాబు రియాక్షన్..
రాజ్యాంగ సంస్థలు.. రాజకీయాలకు అతీతంగా ఉంటాయని, వాటి పవిత్రతను కాపాడుకోవడం సమష్టి విధి అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన స్పందించారు. జరిగిన ఘటన దురదృష్టకరమని తెలిపారు. రాష్ట్రపతి పదవిని అవమానించేలా బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రపతి పట్ల అత్యంత గౌరవ, మర్యాదలతో మెలగాల్సి ఉందని తెలిపారు. దేశ ప్రధమ పౌరురాలిని గౌరవించుకోవడం ప్రతిఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు.
సీఎస్‌కు నోటీసులతో..
ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ వెంటనే రియాక్ట్ అయింది. ఎక్కడ లోపం జరిగింది? ఎందుకు జరిగింది? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనే కీలక విషయాలపై తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హోం శాఖ ఆదేశించింది. ఈ పరిణామాల క్రమంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోనే అతిపెద్ద సంఖ్యలో అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రం ఇదే కావడం గమనార్హం.