నేను మారితే మీకే ఇబ్బంది.. టీడీపీ నేత‌ల‌కు బాబు వార్నింగ్..!

admin
Published by Admin — March 10, 2026 in Politics, Andhra
News Image

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పార్టీ కేడర్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నేతల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై బాబు నేరుగానే ప్రశ్నల వర్షం కురిపించడంతో పార్టీ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

``పార్టీ విధానాలకు అనుగుణంగా పని చేయాల్సిందే. ఎవరికి వారు స్వయం నిర్ణయాలు తీసుకుంటే కుదరదు. ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా మీరైనా మారాలి.. లేదా నేనైనా మారాలి. ఒకవేళ నేనే మారాల్సి వస్తే, ఆ తర్వాత మీరే ఇబ్బంది పడతారు`` అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నియోజకవర్గాల్లో కొందరు నేతలు గ్రూపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది పార్టీ మనుగడకే ప్రమాదమని ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీ నేతలతో కలుపుగోలుగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కొన్ని చోట్ల కూటమి పార్టీల మధ్య సమన్వయం లోపించిందని వస్తున్న నివేదికలను ఆయన నేతల ముందు ఉంచారు. ``క్షేత్రస్థాయిలో గొడవలు పడితే సహించేది లేదు. కూటమి ధర్మాన్ని పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయి`` అని తేల్చి చెప్పారు. 

ముఖ్యంగా ఒక మహిళా నాయకురాలిని ఉద్దేశించి బాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కుటుంబ తగాదాలను ఇంట్లోనే పరిష్కరించుకోవాల‌ని, వ్యక్తిగత అంశాలను రాజకీయం చేసి పార్టీకి నష్టం కలిగిండ‌చం త‌గ‌ద‌ని ఆయన ఘాటుగా స్పందించారు. ఎవరికి వారు పెత్తనం చెలాయించాలని చూస్తే చూస్తూ ఊరుకోనని, ప్రతి నేత పనితీరుపై తన వద్ద క్షుణ్ణమైన నివేదికలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. మొత్తానికి, నంద్యాల పర్యటనతో చంద్రబాబు తన టీమ్‌కు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు. పని చేసే వారికి అభినందనలు.. గ్రూపు రాజకీయాలు చేసే వారికి ఉద్వాసన తప్పదని ఆయన సంకేతాలిచ్చారు.

Tags
CM Chandrababu TDP Andhra Pradesh Ap Politics Nandyal Chandrababu Naidu
Recent Comments
Leave a Comment

Related News