సారా కొట్టు.. సెంచరీ కొట్టు.. ఇదేం లాజిక్ ఎమ్మెల్యే గారు?

admin
Published by Admin — March 10, 2026 in Politics, Telangana
News Image

సాధారణంగా డాక్టర్లు ``మద్యం తాగకండి.. ఆరోగ్యం పాడవుతుంది`` అని చెబుతుంటారు. కానీ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాత్రం సరికొత్త హెల్త్ టిప్ పట్టుకొచ్చారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన లేవనెత్తబోయే అంశం వింటే మందుబాబులకు పూనకాలు రావడం ఖాయం. ఎందుకంటే, ఆయన దృష్టిలో సారా అనేది కేవలం మత్తు పదార్థం కాదు.. అది 115 ఏళ్ల నిండు నూరేళ్ల ఆయుష్షునిచ్చే ఆర్గానిక్ అమృతం.

అనిరుధ్ రెడ్డి లాజిక్ ప్రకారం.. పూర్వం ఇప్ప పువ్వు సారా తాగిన వాళ్లంతా 115 ఏళ్లు హాయిగా బతికేశారట. మరి ఇప్పుడున్న బ్రాండెడ్ విస్కీలు, బీర్లు తాగే వాళ్లు ఎందుకు 60 ఏళ్లకే వికెట్ పారేసుకుంటున్నారో అని ఆయన తెగ ఫీలవుతున్నారు. విదేశీ కల్తీ బ్రాండ్ల కంటే మన ఊరి ఇప్ప పువ్వు ఆర్గానిక్ సారా మేలని ఆయన అసెంబ్లీ సాక్షిగా వాదించబోతున్నారు. అంటే ఇకపై జిమ్‌లకు వెళ్లడం, పౌష్టికాహారం తినడం మానేసి.. పొద్దున్నే ఒక క్వార్టర్ ఇప్ప సారా వేస్తే చాలు, సెంచరీ కొట్టేయొచ్చన్నమాట.

అంతేకాదు, ఈ సారా తయారీ వల్ల రాష్ట్రానికి ఏకంగా లక్ష కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అనిరుధ్ రెడ్డి లెక్కలు గట్టారు. అసలే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, ఇలాంటి కిక్కు ఇచ్చే ఐడియా రావడం నిజంగా గ్రేట్. తెలంగాణ నుంచి ఇప్ప సారాను విదేశాలకు ఎగుమతి చేసి మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్‌ను గ్లోబల్ లెవల్‌లో నిలబెట్టాలనేది ఆయన మాస్టర్ ప్లాన్. 

అందులో భాగంగానే సారా దుకాణాలను ఎందుకు బంద్ చేశారో తెలవాలని, మళ్ళీ రాష్ట్రవ్యాప్తంగా వీటిని తెరవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా దీన్ని అభినందిస్తాయని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చలు జరుగుతాయో లేదో కానీ, అనిరుధ్ రెడ్డి మాత్రం ఇప్ప పువ్వు - ఆర్గానిక్ సారా పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే గారి పుణ్యమా అని సారాకు ఒక చారిత్రక హోదా, సైంటిఫిక్ గుర్తింపు వచ్చేలా ఉంది. మరి ఈ హెల్త్ డ్రింక్ ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందో లేదో చూడాలి.

Tags
MLA Anirudh Reddy Ippa Puvvu Sara Telangana Politics Congress Telangana
Recent Comments
Leave a Comment

Related News