నందమూరి తారకరత్న మరణం ఆ కుటుంబంలోనే కాదు, తెలుగు సినీ అభిమానులందరిలోనూ తీరని లోటును మిగిల్చింది. ఆయన భౌతికంగా దూరమైనా, భార్య అలేఖ్య రెడ్డి గుండెల్లో, సోషల్ మీడియా పోస్టుల్లో ఆయన జ్ఞాపకాలు సజీవంగానే ఉన్నాయి. అయితే, తారకరత్న మరణం తర్వాత అలేఖ్య ఎదుర్కొంటున్న ఒంటరి పోరాటం, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న దూరం గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
తారకరత్న కుటుంబంతో అలేఖ్యకు ఉన్న సంబంధాల గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ, వాటన్నింటికీ ఈ ఇంటర్వ్యూతో ఆమె తెరదించారు. నందమూరి కుటుంబంలోని మిగిలిన సభ్యులతో ఆమెకు ప్రస్తుతం ఎటువంటి కాంటాక్ట్ లేదని స్పష్టం చేశారు. అయితే, ఈ కష్టకాలంలో తనకు, తన పిల్లలకు కొండంత అండగా నిలుస్తున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. ``మా యోగక్షేమాలు తెలుసుకునే వ్యక్తి, మా గురించి ఆలోచించే వ్యక్తి ఒక్క బాలయ్య బాబాయ్ మాత్రమే`` అని చెబుతూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా నందమూరి కళ్యాణ్ రామ్ గురించి కూడా అలేఖ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కళ్యాణ్ రామ్ తనకు ఒక మంచి స్నేహితుడిలా ఉండేవారని, కానీ పరిస్థితులు ఇప్పుడు అలా లేవని ఆమె మాటల్లో వ్యక్తమైంది. తారకరత్నతో తన పరిచయం స్నేహంగా మొదలై, ఆపై పెళ్లికి దారితీసిన వైనాన్ని గుర్తుచేసుకున్న అలేఖ్య.. తన మొదటి వివాహం విఫలమయ్యాక మళ్ళీ పెళ్లి వద్దనుకున్నానని, కానీ తారకరత్న ఇచ్చిన నమ్మకమే తనను ఈ బంధంలోకి నడిపించిందని తెలిపారు.
ఇదే ఇంటర్వ్యూలో తన అత్తమామల విషయంలో అలేఖ్య తన ఆవేదన బయటపెట్టారు. ``నేను నా పిల్లలను నా దగ్గర ఉన్నదాంట్లోనే గొప్పగా పెంచగలను.. కానీ, తారకరత్న తల్లిదండ్రులు నా పిల్లలను ఒక్కసారి దగ్గరకు తీసుకుంటే చూడాలని ఉంది`` అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. పెద్దవారు కాబట్టి కోపం ఉండొచ్చని, కానీ ఆ కోపం పిల్లల మీద చూపించకుండా ఒక్కసారి వారిని ఆశీర్వదిస్తే చాలని ఆమె చేసిన విన్నపం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇప్పటికైనా ఆ కుటుంబ పెద్దలు మనసు మార్చుకుని అలేఖ్యను, పిల్లలను దగ్గరకు తీసుకుంటారేమో చూడాలి.