అన్ని గ్రహాలు ఒక వరుసలోచేరిన సమయంలో అద్భుతాలు జరుగుతాయని సినిమాల్లో చెబుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ప్రపంచ దేశాల సంగతేమో కానీ.. భారతదేశం మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ వేసవిలో ఏసీ(AC) కొనాలన్న ప్లాన్ లో ఉన్న వారికి షాకిచ్చే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ఇప్పటికే జరుగుతున్న యుద్దాలకు కొనసాగింపుగా.. ఇరాన్ -ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న తాజా యుద్దం మన మీద ప్రభావాన్ని చూపుతోంది. దీనికి తోడు.. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తోడు ఇటీవల కాలంలో కొన్ని లోహాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారం.. వెండితో పాటు రాగి లాంటి లోహాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు.. ఏఐ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా చిప్ కొరత మరింత పెరిగింది. మొత్తంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో కీలకమైన రాగి.. బంగారం.. వెండితో పాటు.. చిప్ ల ధరలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ ప్రభావం ఆయా ఉత్పత్తుల మీద పడుతోంది.
సమ్మర్ వస్తుందంటే చాలు.. మారే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఫ్రిజ్ లు.. ఏసీల డిమాండ్(demand for ac) పెరుగుతోంది. ఫ్రిజ్ అన్నది మధ్యతరగతి మాత్రమే కాదు.. పేదవారింట్లో కూడా సహజంగా మారిన పరిస్థితి. ఇప్పుడు ఏసీలు సైతం మధ్యతరగతి.. దిగువ మధ్యతరగతి వారు సైతం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. మారిన వాతావరణ పరిస్థితులు.. తీవ్ర ఇబ్బందులకు గురి చేయటంతో పాటు.. త్వరగా అలిసిపోయేలా చేస్తున్న పరిస్థితి. దీంతో.. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. ఏసీలు కొనే అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ఎయిర్ కండిషనర్(Air Conditioner) కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి షాకిచ్చే పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన రాగి ధరలతో పాటు.. ఇటీవల కాలంలో పడిపోయిన రూపాయి మారకం విలువతో ఏసీ ధరలు పెరగనున్నాయి. ఈ పెరుగుదల(price hike) తక్కువలో తక్కువ పది శాతం నుంచి పదిహేను శాతం వరకు ఉంటాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ స్థాయిలో 10 నుంచి 15 శాతం పెరగనున్న నేపథ్యంలో.. వినియోగదారుడి చేతికి వచ్చేసరికి ఈ పెరుగుదల మరో ఐదు శాతం అదనం అవుతుంది. అంటే.. రూ.30వేలు పెట్టి ఏసీ కొనే వారికి రూ.6 వేల వరకు అయితే.. రూ.40వేల వరకు కొనే వారికి దగ్గర దగ్గర రూ.7-8 వేల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. త్వరలో పలు ఏసీ బ్రాండ్లు తమ ధరల్నిపెంచే ఆలోచన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ కొనే ప్లాన్ ఉంటే.. వెంటనే కొనేయటం ద్వారా పెరిగే భారాన్ని అంతో ఇంతో తగ్గించుకునే వీలుంది.