ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు మోగిన న‌గారా

admin
Published by Admin — March 15, 2026 in National
News Image

దేశ‌వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల(5 states)(ఒక‌టి అసెంబ్లీ ఉన్న కేంద్ర‌పాలిత ప్రాంతం)కు ఎన్నిక‌ల(elections) న‌గారా మోగింది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఆయా రాష్ట్రాల్లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ద‌శ‌ల వారీగా వెలువ‌రించ‌నుంది. ఈ మేర‌కు తాజాగా ఆదివారం.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం(election commission of India) షెడ్యూల్ ప్ర‌క‌టించింది.

1. అస్సాం: మొత్తం అసెంబ్లీ స్థానాలు: 126, పోలింగ్ తేదీ- ఏప్రిల్ 9. కౌంటింగ్ తేదీ మే 4. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. ఇక్క‌డ బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా స్థానిక పార్టీలు ఉన్న‌ప్ప‌టికీ.. పెద్ద‌గా పోరాడే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

2. తమిళనాడు: మొత్తం అసెంబ్లీ స్థానాలు:240, పోలింగ్ తేదీ- ఏప్రిల్ 23; కౌంటింగ్ తేదీ- మే 4. ప్ర‌స్తుతం డీఎంకే పార్టీ అధికారంలో ఉంది. సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఈ పార్టీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా రాష్ట్రంలో వాడి వేడి ప‌రిస్థితి నెల‌కొంది. బీజేపీ వ్యూహాత్మ‌కంగాపావులు క‌దుపుతోంది. ఉప‌రాష్ట్ర‌పతి సీపీ రాధాకృష్ణ‌న్ ఈ రాష్ట్రానికి చెందిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఈ స్టేట్‌కే చెందిన ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ వైర‌ముత్తుకు జ్ఞాన పీఠ్ అవార్డును కూడా ప్ర‌క‌టించ‌డం ఎన్నిక‌ల‌కు ముందు ఆస‌క్తిగా మారింది.

3. పశ్చిమ బెంగాల్: మొత్తం స్థానాలు 294.(అతి పెద్ద‌రాష్ట్రం ఇదే). ఇక్క‌డ 2 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నారు. గ‌త ఐదేళ్ల కింద‌ట ఇక్క‌డ 7 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించారు.ఇక, తాజా షెడ్యూల్ ప్ర‌కారం.. పోలింగ్ తేదీ- ఏప్రిల్ 23 (మొదటి దశ), ఏప్రిల్ 29 (2వ దశ); కౌంటింగ్ తేదీ- మే 4. కాగా.. అధికార పార్టీ టీఎంసీ దూకుడుగా ఉన్న‌ప్ప‌టికీ.. మూడు సార్లు ఇప్ప‌టికే మ‌మ‌త‌ను గెలిపించిన ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఈ ద‌ఫా బీజేపీ ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా మారింది. ఇక్క‌డ మ‌రోసారి మ‌మ‌త గెలుపు అంటే.. ఏదైనా పెద్ద చిత్రం జ‌రిగితే త‌ప్ప సాకారం అయ్యేది కాద‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

4. కేరళం: మొత్తం అసెంబ్లీ స్థానాలు 140. పోలింగ్ తేదీ- ఏప్రిల్ 9; కౌంటింగ్ తేదీ- మే 4. ఇక్క‌డ క‌మ్యూనిస్టుల ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల తిరువ‌నంత‌పురం స‌హా.. ప‌లు స్థానిక ఎన్నిక‌ల‌లో బీజేపీ పుంజుకుంది. ఈ ప్ర‌భావం ఉండే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

5. పుదుచ్చేరి( కేంద్ర పాలిత ప్రాంతం) మొత్తం స్థానాలు 30. పోలింగ్ తేదీ- ఏప్రిల్ 9; కౌంటింగ్ తేదీ- మే 4. ఇక్క‌డ బీజేపీతో భాగ‌స్వామ్య ప‌క్షంగా ఉన్న ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తిరిగి త‌మ స్థానం నిల‌బెట్టుకునేందుకు ఈ కూట‌మి ప్ర‌య‌త్నిస్తోంది.

Tags
Election commission of India notification 5 states
Recent Comments
Leave a Comment

Related News