ఆస్కార్ వేదికపై మన కోట..!

admin
Published by Admin — March 16, 2026 in Movies
News Image

తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం ఆవిష్కృతమైంది. వెండితెరపై తన వాచకంతో, విలక్షణమైన నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాసరావు పేరు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై మారుమోగింది. ప్రతిష్ఠాత్మక 98వ అకాడమీ అవార్డుల (Oscars) వేడుకలో ఆయనకు దక్కిన గౌరవం చూసి ప్రతి తెలుగువాడి గుండె గర్వంతో ఉప్పొంగుతోంది.

ఏటా సినీ లోకాన్ని వీడిన దిగ్గజాలకు నివాళులర్పించే ఇన్ మెమోరియం విభాగం ఆస్కార్ వేడుకలో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టం. ఈసారి లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వేడుకలో, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాలీవుడ్ నటుల మధ్యలో మన కోట శ్రీనివాసరావు చిత్రం కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. భారతీయ నటుల జాబితాలో కోట పేరును ముందుగా ప్రస్తావించడం ఆయన నటనా పటిమకు అకాడమీ ఇచ్చిన అసలైన గుర్తింపు.

బాలీవుడ్ లెజెండ్స్ ధర్మేంద్ర, సీనియర్ నటి సరోజాదేవి, మనోజ్ కుమార్ వంటి మహామహులతో పాటు కోట శ్రీనివాసరావు పేరును ఆస్కార్ అకాడమీ స్మరించుకుంది. కేవలం వేదికపైనే కాకుండా, అకాడమీ అధికారిక వెబ్‌సైట్ గ్యాలరీలో కూడా ఆయన ఫోటోను ఉంచి గౌరవించడం విశేషం. 2025 జూలైలో ఆయన కన్నుమూసినప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఒక ధ్రువతారను కోల్పోయిందని అంతా బాధపడ్డారు. కానీ, నేడు ఆస్కార్ వేదికపై ఆయనను చూశాక, కళాకారుడికి మరణం లేదు.. కేవలం సెలవు మాత్రమే అనే మాట మరోసారి నిజమైంది.

విలన్‌గా భయపెట్టినా, కామెడీతో కడుపుబ్బ నవ్వించినా, తండ్రి పాత్రల్లో కన్నీళ్లు పెట్టించినా అది కేవలం కోట గారికే సాధ్యం. తొమ్మిది నంది అవార్డులు, పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఆయన ప్రస్థానం ఇప్పుడు ఆస్కార్ నివాళితో పరిపూర్ణమైంది. ప్రాంతీయ భాషా నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, అంతర్జాతీయ వేదికపై నివాళులు అందుకునే స్థాయికి ఎదగడం అంటే అది తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పడమే.

Tags
Oscars 2026 Kota Srinivasa Rao Tollywood In Memoriam Oscar Awards
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News