ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(president murmu).. ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత రామమందిరాన్ని దర్శించుకున్నారు. అయోధ్య(ayodhya)లోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేయడంతోపాటు.. రామ మంత్ర యంత్రాన్ని కూడా ఆమె స్వయంగా స్థాపించారు. వాస్తవానికి అయోధ్యలో బాలరామయ్య ప్రాణ ప్రతిష్ఠ సమయంలో రాష్ట్రపతిని దూరంగా ఉంచడం వివాదాలకు.. రాజకీయ విమర్శలకు కూడా దారితీసింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంది.
అనంతరం రెండోసారి రాష్ట్రపతి గురువారం రామాలయాన్ని దర్శించుకోవడం.. మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రారంభం కావడం వంటివాటిని ఉదహరిస్తూ.. జాతీయ మీడియా విశ్లేషణలు గుప్పిస్తుండడం గమనార్హం. ఈమెతో పాటు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి.. భారీగా సత్కరించారు. వీరిలో మునిసిపల్ కార్మికుల నుంచి భవన నిర్మాణ కార్మికుల వరకు వందల మంది ఉన్నారు.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను బీజేపీ కీలకంగా తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో ఎస్సీలు, ఎస్టీలను.. తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. అయితే.. ఇవే రాష్ట్రాల్లో ఇటీవల .. ముఖ్యమంత్రులు రాష్ట్రపతి-అయోధ్యల ప్రస్తావన తీసుకు వచ్చారు. రాష్ట్రపతిని అయోధ్యలోకి రాకుండా చేసి.. అవమానించింది మీరు కాదా.. అంటూ మమతా బెనర్జీ(బెంగాల్ సీఎం) ప్రశ్నించారు. రెండు కీలక ఘట్టాలకు రాష్ట్రపతిని దూరంగా ఉంచారంటూ.. ఆమె ఫొటోలను కూడా విడుదల చేశారు.
ఇక, తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన కార్యక్రమంలోనూ సీఎం స్టాలిన్.. ఎస్టీలు, ఎస్సీలంటే బీజేపీ కి అత్యంత చులకన అని వ్యాఖ్యానించి.. అయోధ్యకు రాష్ట్రపతి రాకుండా చేశారని విమర్శించారు. ఈ పరిణామాలతో మరింత ఎక్కువగా క్షేత్రస్థాయి ప్రచారం పుంజుకుంది. ఈ నేపథ్యంలో రాజకీయ కార్యక్రమం కాకపోయినా.. రాష్ట్రపతి అయోధ్యలో పర్యటించడం ద్వారా.. అది కూడా ఎన్నికలకు ముందు.. కావడంతో బీజేపీ ఆయా విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసిందన్నది జాతీయ మీడియా విశ్లేషణలు. మరి ఇది ఏమేరకు బీజేపీకి మేలు చేస్తుందో చూడాలి.