ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దృశ్యం-3’ ఒకటి. సౌత్ ప్రేక్షకులందరూ మలయాళ వెర్షన్ కోసం ఎదురు చూస్తుండగా.. నార్త్ ఆడియన్స్ హిందీ వెర్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ముందుగా మలయాళ వెర్షన్ ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. గత ఏడాదే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసిన చిత్ర బృందం.. విడుదలకు అన్ని ఏర్పాట్లూ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితులు విడుదలకు అనుకూలంగా లేకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుదల కావట్లేదట. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.
‘దృశ్యం-3’ వాయిదాకు కారణం.. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు బాగా లేకపోవడమే. అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో అనిశ్చితి నెలకొంది. అక్కడ కొన్ని వారాలుగా అక్కడ గగన తలాన్ని మూసేశారు. దైనందిన కార్యక్రమాలు స్తంభించిపోయాయి. ఆ దేశాల్లో కొత్త సినిమాలు రిలీజ్ కావట్లేదు. మలయాళ చిత్రాలకు గల్ఫ్ దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా మోహన్ లాల్ సినిమాలకు ఆ దేశాల్లో భారీ వసూళ్లు వస్తుంటాయి. అక్కడ ఆయన సినిమా రిలీజ్ కాకపోతే చాలా ఆదాయం కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే ‘దృశ్యం-3’ని వాయిదా వేయాలని టీం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
‘దృశ్యం-3’కి ఉన్న హైప్ దృష్ట్యా ఈపాటికే ఆ సినిమా ప్రమోషన్లు గట్టిగా చేస్తుండాలి. కానీ టీం సైలెంట్‌గా ఉంది. పరిస్థితులు మెరుగుపడతాయేమో, థియేటర్లు తెరుచుకుంటాయేమో అని చూశారు కానీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. సాధారణ పరిస్థితులు రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. కాబట్టి మళ్లీ థియేటర్లు తెరుచుకున్న దాన్ని బట్టి ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఖరారు చేస్తారు. వచ్చే నెలలోనే రావల్సిన మోహన్ లాల్, మమ్ముట్టిల మల్టీస్టారర్ ‘పేట్రియాట్’ను కూడా వాయిదా వేయడం లాంఛనంగానే కనిపిస్తోంది.