తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి(Malla Reddy) అంటేనే ఒక వైబ్. ఆయన మాట్లాడితే అది వైరల్ కావాల్సిందే, ఆయన నవ్వితే అది మీమ్ కావాల్సిందే. అయితే, తాజాగా అసెంబ్లీ వేదికగా మీడియా చిట్‌చాట్‌లో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయాల్లో ఇప్పటికే చక్రం తిప్పిన ఈ మాజీ మంత్రి, ఇప్పుడు తన మనసులో ఉన్న ఒక బలమైన కోరికను బయటపెట్టారు. అదే ముఖ్యమంత్రి పదవి. అయితే ఇది రియల్ లైఫ్ కోసం కాదు.. రీల్ లైఫ్ కోసం.
సాధారణంగా సినిమాల్లో రాజకీయ నాయకులను విలన్లుగా చూపిస్తుంటారు. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) సైతం మల్లారెడ్డిలోని ఈజ్ చూసి, `ఉస్తాద్ భగత్ సింగ్ ` సినిమాలో విలన్ పాత్ర కోసం ఆయన్ని సంప్రదించారట. కానీ, మల్లారెడ్డి ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. దానికి ఆయన చెప్పిన కారణం ఆసక్తికరంగా ఉంది. తనకు విలన్ వేషాలు వేయడం ఇష్టం లేదని, వెండితెరపై ఒక్కసారైనా ముఖ్యమంత్రి (CM) పాత్రలో కనిపించాలన్నది తన కోరికని ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి పవర్‌ఫుల్ రోల్ వస్తే మేకప్ వేసుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డిని సీఎం చేసింది నేనే!
కేవలం సినిమాల గురించే కాకుండా, ప్రస్తుత రాజకీయ సమీకరణాలపై కూడా మల్లారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. `` రేవంత్ రెడ్డిని సీఎం చేసింది నేనే`` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రెడ్డి సంఘం మీటింగ్‌లోనే.. రేవంత్ అంత దమ్మున్న నాయకుడు రెడ్డి సామాజిక వర్గంలోనే లేరని తాను చెప్పానని, అవసరమైతే ఆ వీడియో కూడా చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా పార్టీలు వేరైనా.. వ్యక్తిగతంగా తామిద్దరం అన్నదమ్ములమని చెప్పడం గమనార్హం.
అసెంబ్లీ లాబీల్లో మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అటు రాజకీయ నాయకులు, ఇటు సినీ ప్రేక్షకులు మల్లారెడ్డి సీఎం కోరికపై రకరకాలుగా స్పందిస్తున్నారు. మొత్తానికి రియల్ పాలిటిక్స్‌లో కింగ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్న మల్లారెడ్డి(Malla Reddy), రీల్ లైఫ్‌లో సీఎం కిరీటాన్ని ఎప్పుడు ధరిస్తారో వేచి చూడాలి.