గాయపడ్డ సింహం... కండిషన్స్ అప్లై

admin
Published by Admin — March 25, 2026 in Movies
News Image
దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. ఆ తర్వాత నటుడిగా బిజీ అయ్యాడు తరుణ్ భాస్కర్(tharun bhascker). అతను దర్శకుడిగా మారి పదేళ్లు కావస్తుండగా.. ఇన్నేళ్లలో తీసింది మూడు సినిమాలే. నాలుగో చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది-2’ సెట్స్ మీద ఉంది. నటుడిగా ఇప్పటికే ఈ ఏడాది ‘ఓం శాంతి శాంతి శాంతి:’ చిత్రంతో పలకరించిన తరుణ్.. త్వరలో ‘గాయపడ్డ సింహం’ (gayapadda simham)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రేజీ ప్రోమోతో ఆకట్టుకున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఖరారైంది. మే 1న ‘గాయపడ్డ సింహం’ థియేటర్లలోకి దిగబోతోంది.
 
ఐతే ఏప్రిల్ 30న రామ్ చరణ్ క్రేజీ మూవీ ‘పెద్ది’ సినిమా రిలీజవుతుండగా.. తర్వాతి రోజే తరుణ్ భాస్కర్ చిత్రాన్ని విడుదల చేయడం సాహసమే. పైగా ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తుండడం గమనార్హం. చరణ్ సినిమాకు పోటీగా రాజు సినిమాను తీసుకెళ్తే, దీనికి ఎక్కువ థియేటర్లు ఇస్తే వివాదం రాజుకోవడం ఖాయం. ఈ విషయాన్ని గ్రహించి దిల్ రాజు ‘గాయపడ్డ సింహం’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు.
 
‘గాయపడ్డ సింహం’ విడుదలకు షరతులు వర్తిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘పెద్ది’ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోందని.. అలాంటి సినిమాకు ఎదురెళ్లి థియేటర్లు తీసుకుంటే మళ్లీ తనను అందరూ కలిసి వేసుకుంటారని రాజు వ్యాఖ్యానించారు. ఒకవేళ ‘పెద్ది’ సినిమా వాయిదా పడితేనే మే 1న ‘గాయపడ్డ సింహం’ వస్తుందని.. అలా కాని పక్షంలో వారం రోజులు ఈ చిత్రాన్ని వాయిదా వేసుకోవడానికి టీం సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
 
అమెరికాకు వెళ్లి స్థిరపడాలని చూసే ఒక కుర్రాడు.. ట్రంప్ వచ్చాక కఠినతరమైన వీసా సమస్యల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనే కథాంశంతో ‘గాయపడ్డ సింహం’. తెరకెక్కింది. సూర్యప్రకాశ్ జోస్యుల కథ అందించి ఈ చిత్రాన్ని కశ్యప్ శ్రీనివాస్ రూపొందించాడు. దీని ట్రైజర్ (టీజర్+ట్రైలర్) చాలా ఫన్నీగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో తరుణ్ సరసన ఫరియా అబ్దులా, మానస చౌదరి నటించారు.
Tags
gayapadda simham telugu movie director and actor tharun bhascker
Recent Comments
Leave a Comment

Related News