యుద్ధ సెగ.. భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు!

admin
Published by Admin — March 26, 2026 in National
News Image

పశ్చిమాసియా సంక్షోభం(Middle East Conflict) సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధం.. ఇప్పుడు నేరుగా భారతీయుడి జేబుకు చిల్లు పెడుతోంది. అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో, దేశీయంగా ఇంధన సెగ మొదలైంది. ప్రైవేట్ చమురు దిగ్గజాలు ధరల బాదుడుకు శ్రీకారం చుట్టడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.

దేశవ్యాప్తంగా దాదాపు 7,000 అవుట్‌లెట్లను కలిగి ఉన్న ప్రముఖ ప్రైవేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ(Nayara Energy), ధరలను అకస్మాత్తుగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ భాగస్వామ్యం ఉన్న ఈ సంస్థ, ఒక్కసారిగా పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 3 మేర భారాన్ని మోపింది. ఇక పరిశ్రమలకు వినియోగించే ఇండస్ట్రియల్ డీజిల్ ధరను ఏకంగా లీటరుకు రూ. 22 పెంచి పెద్ద షాక్ ఇచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పన్నుల (VAT) ప్రభావంతో ఈ పెంపు రూ. 5.30 మార్కును కూడా దాటేసింది.

ప్రస్తుతానికి ప్రభుత్వ రంగ సంస్థలైన IOC, BPCL, HPCL తో పాటు రిలయన్స్-బీపీ వంటి సంస్థలు ధరలను స్థిరంగా ఉంచడం కొంత ఊరట కలిగించే విషయమే. మార్కెట్‌లో 90 శాతం వాటా ప్రభుత్వ సంస్థలదే అయినప్పటికీ, నయారా తీసుకున్న ఈ నిర్ణయం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల అస్థిరతే దీనికి ప్రధాన కారణమని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ప్రైవేట్ బంకుల్లో పెరిగిన రేట్లను చూసి, మిగిలిన సంస్థలు కూడా రేపో మాపో రేట్లు పెంచుతాయేమోనన్న భయం సామాన్యుడిలో మొదలైంది.

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమైతే సరఫరా మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ముడిచమురు ధరలు వంద డాలర్ల మార్కును దాటడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆందోళనతోనే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాహనదారులు పెట్రోల్(Petrol) బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ధరలు మరింత పెరగకముందే ట్యాంకులు నింపుకోవాలనే తొందరలో జనం కనిపిస్తున్నారు. ఈ సంక్షోభం ఇప్పట్లో సద్దుమణగకపోతే, రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

Tags
Fuel Price Hike Petrol Price Diesel Price Nayara Energy War Energy Crisis
Recent Comments
Leave a Comment

Related News