మార్కాపురం(markapuram) జిల్లాలో చోటు చేసుకున్న హరిక్రిష్ణ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఘోర ప్రమాదానికి(accident) సంబంధించిన షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. ప్రత్యక్ష సాక్ష్యులుగా నిలిచిన ఆ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు విస్తుపోయే వాస్తవాల్ని వెల్లడించారు. తెలంగాణలోని జగిత్యాల నుంచి బయలుదేరిన ఈ బస్సు కండీషన్ అస్సలు బాగోలేదని చెబుతన్నారు. మర్కాపురం జిల్లాలో ట్రావెల్ బస్సును టిప్పర్ బలంగా ఢీ కొనటం.. ఆ వెంటనే రగులుకున్న మంటలతో 14 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
సెకన్ల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో బస్సు వెనుక భాగం తీవ్రంగా దెబ్బ తిని అందులో నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో 14 మంది ప్రాణాలు పోయిన దుస్థితి. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదం నేపథ్యంలో అందులోని ప్రయాణికులు కొందరు బస్సుకు సంబంధించి విషయాల్ని వెల్లడించారు. తాము ప్రయాణించిన బస్సు కండీషన్ అస్సలు బాగోలేదని.. అదే విషయాన్ని తాము డ్రైవర్ కు కూడా చెప్పినట్లు తెలిపారు.
ఈ బస్సును యర్రగొండపాలెం వద్ద గంటసేపు ఆపేసి.. రిపేర్లు చేశారని చెప్పిన ప్రయాణికులు.. ఎందుకు బస్సును నిలిపారని ప్రశ్నించగా.. స్టీరింగ్ స్ట్రక్ అయినట్లుగా చెప్పారని.. కండీషన్ లో లేని బస్సును ఆర్టీఐ అధికారులు ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తున్నారు.
దీంతో.. బస్సు బయలుదేరి కాసేపటి తర్వాత యర్రగొండపాలెం వద్ద గంటకు పైనే బస్సును నిలిపేసినట్లు వారు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఈ బస్సు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు జిల్లా కలెక్టర్.. ఎస్పీలు వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో 35 మంది ఉన్నారని.. వారిలో 14 మంది మరణించగా..22 మంది గాయపడ్డారని తెలిపారు. గాయాలకు గురైన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘోర ప్రమాదం గురించి తెలిసినంతనే సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ముఖ్యమంత్రి.. ప్రమాదంపై దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు.
మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం.. గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షించేందుకు మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పారు.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి కూడా ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించింది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
మరోవైపు ఈ ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. మరణించిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఏపీ అధికారులతో మాట్లాడాలని సీఎస్ రామక్రిష్ణరావుకు చెప్పారు. జగిత్యాల నుంచి బయలుదేరిన ఈ బస్సు లోని ప్రయాణికుల గురించి వివరాలు సేకరించాలన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎస్.. ఏపీ సీఎస్ తో మాట్లాడారు.