ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు మరో రెండు నెలలు మాత్రమే గడువు ఉంది. ఇక, అమరావతి నిర్మాణం వడివడి గా వేగం పుంజుకుంది. అదేసమయంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా వేగంగా ముందుకు సాగుతున్నా యి. ఇక, పార్లమెంటులో అమరావతి(amaravati) రాజధానికి చట్టబద్ధత కలగనుంది. ఈ పరిణామాల క్రమంలో సీఎం చంద్రబాబు(cm chandrababu)తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు.. ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సానుకూలతను మరింత పెంచే బాధ్యతను వారికి అప్పగించా రు. ఒకవైపుసానుకూలతను పెంచడంతోపాటు వైసీపీ దాడిని కూడా బలంగా ఎదుర్కొనాలని సూచించారు.
స్థానిక ఎన్నికల్లో పార్టీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి నియోజకవర్గంలోనూ ఓట్లు కూటమికి అనుకూలంగానే రావా లని.. ప్రతి కార్పొరేషన్, ప్రతిమునిసిపాలిటీలోనూ కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారని.. కాబట్టి విజయం కూటమికే దక్కాలని.. దీనికి ఎమ్మెల్యేలు, ఎంపీలు బాధ్యత తీసుకోవాలన్నారు. ``ఏదో అంతా ప్రభుత్వం చూస్తుంది.. పార్టీ చూస్తుంది..అనే ఉదాశీనత వద్దు``అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇక, సంక్షేమ పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని.. ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ విషయంలో ప్రజల సానుకూలత, సంతృప్తి ముఖ్యమని వ్యాఖ్యానించారు.
అమరావతి విషయంలో వైసీపీనేతలు ఇంకా కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే అసెంబ్లీలో చట్టబద్ధతకు సంబంధించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి.. తీర్మానాన్ని కేంద్రానికి పంపించామన్నారు. కానీ.. ఇంకా వైసీపీ దీనిపైనా కుట్రలు చేస్తోందన్నారు. ఈ కుట్రలను మరింత సామర్థ్యంతో తిప్పికొట్టాలని చంద్రబాబు చెప్పారు. ఎక్కడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదననారు. ఇక, పార్లమెంటులో రెండు రోజుల్లోనే అమరావతి చట్టబద్ధత బిల్లు కూడా ఆమోదం పొందుతుందని చంద్రబాబు తెలిపారు.
బలమైన వాణి..
లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం ప్రవేశ పెట్టనున్నారని.. దీనిపై టీడీపీ ఎంపీలు బలమైన వాణిని వినిపించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైసీపీ చేసిన ద్రోహాన్ని జాతీయస్థాయిలో మరోసారి వినిపించేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలన్నారు. చర్చలో ఇతర రాష్ట్రాల ఎంపీలకంటే.. ఏపీ ఎంపీలకే ఎక్కువసమయం ఇస్తారని.. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోక్‌సభలో వైసీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నంచేయొచ్చని.. అమరావతిపై విషం చిమ్మే ప్రయత్నం చేయొచ్చని.. అలాంటి సందర్భాల్లో కూటమి ఎంపీలతో కలిసి.. బలమైన ఎదురు దాడి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.