ఏపీ రాజధాని అమరావతికి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. దీంతో రాజధానికి చట్టబద్ధతతో పాటు ఏపీ కొత్త రాజధానిగా అమరావతి అవతరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం - 2014లోని సబ్ సెక్షన్‌కు జరిగిన సవరణ మేరకు రాజధాని అమరావతి ఏర్పడిందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన రాజధాని బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు..
ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది.. 2024, జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుంది అని ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా సీఆర్‌డీఏ(క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) - 2014లో పొందుపరిచిన ప్రాంతం మొత్తంగా అమరావతి రాజధానిగా ఉంటుందని కేంద్రం నోటిఫై చేసింది. ``ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటు అయింది. మరియు అది అమరావతిగా ఉంటుంది.`` అని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ బిల్లు ఆమోదం పొందిన విషయాన్ని కూడా నోటిఫికేషన్‌లో వివరించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి రాజీవ్ మణి గెజిట్‌ను జారీచేశారు.
బాబు హర్షం..
రాజధానికి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు `ఎక్స్` వేదికగా ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి, దిశానిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ముఖ్యంగా అమరావతి రైతుల విజయమని సంతోషం వ్యక్తం చేశారు.