జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆయన భార్య అన్నా లెజినోవా కొణిదెల ఫోటోల విషయంలో గత పదేళ్లుగా నెట్టింట ఒక పెద్ద పొరపాటు సాగుతోంది. పవన్ పక్కన ఒక అందమైన విదేశీ మహిళ ఉన్న ఫోటోను చూపిస్తూ.. ఆమే అన్నా లెజినోవా అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే, తాజాగా ఈ ఫోటో వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టి అన్నా అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.
చాలా కాలంగా వైరల్ అవుతున్న ఆ ఫోటోపై అన్నా కొణిదెల స్పందిస్తూ, అందులో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. "ఈ అందమైన మహిళ నేను కాదు. ఈ పొరపాటు ఎక్కడ మొదలైందో తెలియదు కానీ, ఆమె పేరు డానా మార్క్స్" అని క్లారిటీ ఇచ్చారు. డానా మార్క్స్ ఎవరో కాదు.. పవన్ కల్యాణ్ నటించిన 'తీన్ మార్'(Teen Maar) సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసిన అమెరికన్ నటి. అందులోని 'బార్బీ బొమ్మకి' పాటలో కూడా ఆమె కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో నటనలో శిక్షణ ఇస్తున్నారు. ఇద్దరూ విదేశీయులు కావడంతో, నెటిజన్లు డానానే అన్నా లెజినోవా అని పొరబడ్డారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అన్నా కొణిదెల ఇంత వరకు మోడల్‌గా కానీ, నటిగా కానీ చేసింది లేదుట. కానీ 'తీన్ మార్' సినిమా షూటింగ్ సమయంలోనే ఆమె పవన్‌ను కలిశారు. అవును, తీన్ మార్ ప్రొడక్షన్ విభాగంలో అన్నా పనిచేశారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, 2013లో వీరు వైవాహిక బంధంతో ఒకటయ్యారు. వివాహం తర్వాత చాలా ఏళ్ల పాటు ఆమె కెమెరా కళ్లకు దూరంగా ఉండటంతో, మీడియాలో డానా మార్క్స్(Dana Marks) ఫోటోలే అన్నా పేరుతో చెలామణి అయ్యాయి.
గతంలో అన్నా లెజినోవా(Anna Lezhneva) బయట ఎక్కడా కనిపించేవారు కాదు. కానీ, ఈ మధ్య కాలంలో పవన్ రాజకీయ సభల్లో, కుటుంబ వేడుకల్లో ఆమె తరచూ కనిపిస్తున్నారు. దీంతో పాత ఫోటోల్లో ఉన్నది, ఇప్పుడు కనిపిస్తున్నది ఒకే వ్యక్తి కాదు అనే అనుమానం చాలామందికి కలిగింది. తాజాగా అన్నా ఇచ్చిన వివరణతో ఆ కన్ఫ్యూజన్‌కు ఫుల్ స్టాప్ పడింది.