అంబానీ ఆస్తులు ఢ‌మాల్‌.. ఆసియా కొత్త కుబేరుడు ఇతనే!

admin
Published by Admin — April 17, 2026 in National
News Image

ఆసియా వ్యాపార సామ్రాజ్యంలో పెను మార్పు చోటుచేసుకుంది. దశాబ్ద కాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani)ని వెనక్కి నెట్టి, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కిరీటాన్ని దక్కించుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే, సంపద సృష్టిలో అదానీ వేగం ప్రపంచ దిగ్గజాలనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను సైతం తట్టుకొని అదానీ గ్రూప్(Adani Group) షేర్లు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే గౌతమ్ అదానీ నికర ఆస్తి విలువ ఏకంగా 3.56 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 29,600 కోట్లు. దీంతో అదానీ మొత్తం ఆస్తి 92.6 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు, రిలయన్స్ షేర్లు పెద్దగా కదలకపోవడంతో అంబానీ సంపద 90.8 బిలియన్ డాలర్ల వద్దే నిలిచిపోయింది. దీంతో ఆసియా నెం.1 పీఠం అదానీ వశమైంది.

చిత్రమేమిటంటే, 2026 సంవత్సరం ప్రపంచ బిలియనీర్లకు పెద్దగా కలిసి రావడం లేదు. ప్రపంచ టాప్-20 సంపన్నుల్లో ఏడుగురు ఈ ఏడాది భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. ఫ్రెంచ్ బిజినెస్ మేగ్నెట్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఏకంగా 44 బిలియన్ డాలర్లు కోల్పోగా, వారెన్ బఫెట్, బిల్ గేట్స్(Bill Gates) వంటి దిగ్గజాల ఆస్తులు కూడా కరిగిపోయాయి. అంబానీ కూడా ఈ ఏడాది 16.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. కానీ, వీరందరికీ భిన్నంగా గౌతమ్ అదానీ తన సంపదను 8.10 బిలియన్ డాలర్లు పెంచుకొని విజయకేతనం ఎగురవేశారు.

ప్రస్తుత గ్లోబల్ రేంకింగ్స్ ప్రకారం గౌతమ్ అదానీ 19వ స్థానంలో, ముకేశ్ అంబానీ 20వ స్థానంలో కొనసాగుతున్నారు. ఎలాన్ మస్క్(Elon Musk) 656 బిలియన్ డాలర్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నంబర్ వన్‌గా ఉండగా.. భారతీయ దిగ్గజాల మధ్య సాగుతున్న ఈ కుబేర యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక మ‌రి మార్కెట్ ఒడిదుడుకుల మధ్య అదానీ తన అగ్రస్థానాన్ని ఎంతకాలం నిలబెట్టుకుంటారో చూడాలి.

Tags
Adani Group Mukesh Ambani Asias Richest Man Bloomberg Billionaires Gautam Adani Reliance Industries
Recent Comments
Leave a Comment

Related News