ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రాజకీయ సెగలు, భానుడి భగభగలు మామూలుగా లేవు. ఈ వేడిని తట్టుకోవడం మన వల్ల కాదనుకున్నారో ఏమో కానీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చల్లని యూరప్ దేశాలకు చెక్కేసేందుకు సిద్ధమయ్యారు. తన కుటుంబంతో కలిసి దాదాపు 25 రోజుల పాటు విదేశీ గాలి పీల్చుకోవడానికి సీబీఐ కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నారు. అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్న ఆయనకు.. కోర్టు నిబంధనల ప్రకారం పాస్‌పోర్ట్ చేతికి రావడంతో ఇక ఫ్లైట్ ఎక్కడమే తరువాయి.
అయితే గతంలో జగన్ విదేశాలకు వెళ్లినప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు మళ్ళీ చర్చకు వస్తోంది. అప్పట్లో సీబీఐకి అందుబాటులో ఉంటానని చెప్పి, ఎవరో మూడో వ్యక్తి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. తీరా సీబీఐ(CBI) అధికారులు కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అటువైపు నుంచి స్పందన లేదు. దీంతో ఈసారి కోర్టు గట్టిగానే షరతులు పెట్టింది. మీరు వెళ్తే వెళ్లండి కానీ, మీ సొంత ఫోన్ నెంబర్, పని చేసే ఈమెయిల్ ఐడీ కచ్చితంగా ఇవ్వాలి అంటూ జగన్‌ను ఆదేశించింది. మరి ఈసారైనా సీబీఐ అధికారుల ఫోన్లకు ఆయన అందుబాటులో ఉంటారో లేదో చూడాలి.
జగన్ రెడ్డికి విదేశీ పర్యటన అంటే గుర్తొచ్చేది కేవలం లండన్(Landon) మాత్రమే. ఆయన పిల్లలు ఇద్దరూ అక్కడే ఉన్నత చదువులు పూర్తి చేసుకుని స్థిరపడ్డారని సమాచారం. గతంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు వెళ్లొచ్చిన జగన్, ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారా లేక మరేదైనా వ్యాపారాల్లో ఉన్నారా అనే దానిపై క్లారిటీ లేకపోయినా, జగన్ వెకేషన్ డెస్టినేషన్ మాత్రం ఎప్పుడూ లండన్ చుట్టూనే తిరుగుతుంటుంది.
ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచిన తరుణంలో, జగన్(Jagan) ఏకంగా 25 రోజుల పాటు విదేశాలకు వెళ్లడం రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది. ఇక్కడ రాజకీయ సెగలు పెరిగిపోతుంటే, అక్కడ చల్లని యూరప్ వాతావరణంలో సేదతీరాలని ఆయన భావిస్తున్నారు. కోర్టు షరతులు ఉల్లంఘించకుండా, సీబీఐ పిటిషన్లు వేయకుండా ఈ పర్యటన సజావుగా సాగుతుందో లేదో వేచి చూడాలి.