అధికారంలో ఉన్నా, లేకున్నా...వైసీపీ(ycp) మాత్రం కేంద్రంలో ఎన్డీఏకు అన్ని వేళలా మద్దతిస్తూనే ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా లోక్ సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు(women reservation bill)తోపాటు డీలిమిటేషన్ బిల్లునకు కూడా వైసీపీ మద్దతిచ్చింది. అయితే, ఆ బిల్లు వీగిపోవడంతో వైసీపీ అధినేత జగన్ బాధపడుతూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే జగన్(jagan)పై ఆయన సోదరి షర్మిల మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. మోదీ(modi) దత్తపుత్రుడు జగన్ తెర మరోసారి తొలిగిపోయిందంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో షర్మిల(sharmila) చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
"దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది. బీజేపీతో పెట్టుకున్న అక్రమపొత్తు తేటతెల్లమైంది. విపక్షం ముసుగులో ఉన్నది సైతం RSS పక్షమేనని నిజ నిర్ధారణ జరిగింది. TDP, జనసేనల కంటే మోడీ గారిని ఇంతలా మోయాలా? మన దేశ రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే ముఖ్యమా ? అక్రమ డీ లిమిటేషన్ బిల్లులపై NDA పక్షాన నిలబడ్డందుకు YCP అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి. మీ 5 ఏళ్ల పాలనలో చేసిన అవినీతి కోసం ఇంతలా బీజేపీతో అంటకాగాలా? కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బ్రతకాలా? బీజేపీ బిల్లులకు గొర్రెలా గుడ్డిగా తలాడించాలా ? మోదీ గారి మెప్పుకోసం సొంత కాకిలెక్కలు అల్లాలా?
ఇదేనా మీరు చెప్పే YSR ఆశయాలు, వారసత్వం ? మహానేత సిద్ధాంతాలను మంట గలిపినందుకు, విలువలకు తూట్లు పొడిచినందుకు జగన్ గారే ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజ్యాంగానికి విఘాతం కలిగించే అక్రమ బిల్లును విపక్షాలు అడ్డుపడి విజయం సాధిస్తే, ఏం సాధించారని ప్రశ్నించడం తీవ్ర హాస్యాస్పదం. దొంగ బిల్లులకు ఓటేసి ఇంతకు మీరేం సాధించారు? కోట్లాది AP రాష్ట్ర ప్రజల గుండెలు గాయపరచడమా మీరు సాధించిన గొప్పతనం.
దక్షిణాది రాష్ట్రాల బావోగ్వేదాన్ని అర్థం చేసుకోకపోవడమా మీ రాజకీయం ?ప్రతిపక్షంగా విపక్షానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి అధికార పక్షానికి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ? జగన్ గారు చేసిన నీచపు పనికి YSR ఆత్మ నిజంగా ఘోషిస్తోంది. మహిళా బిల్లును, డీ లిమిటేషన్ కి లింక్ పెట్టడం జగన్ గారి అవివేకానికి నిదర్శనం. న్యాయం జరగలేదని, సాకారం కాలేదని మీరే అంటున్నారా లేక మోడీ గారు మీచేత కూడా చెప్పించారా ? మహిళల 33 శాతం రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకం కాదు. అవనికి అగ్రతాంబూలం అందిస్తుంటే అభ్యంతరం ఎవరికి లేదు.