నటుడిగా చాలా వరకు మామూలు పాత్రలే చేసిన రవిబాబు(tollywood actor and director ravibabu).. అల్లరి సినిమాతో దర్శకుడిగా మారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. మొరటు విలన్ పాత్రలు చేసే నటుడు.. దర్శకుడిగా అలాంటి వెరైటీ కామెడీ సినిమా తీస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. మొదట్లో కామెడీ సినిమాలు ట్రై చేసి, ఆ తర్వాత అనసూయ, అమరావతి, అవును లాంటి స్టన్నింగ్ థ్రిల్లర్లు తీసి షాకిచ్చాడు రవిబాబు.
ఐతే అవును తర్వాత రవిబాబుకు దర్శకుడిగా విజయాలు లేవు. లడ్డు బాబు, అవును-2, అదుగో, ఆవిరి, క్రష్.. ఇలా చాలా ఫ్లాపులే ఇచ్చాడాయన. చివరగా ఈటీవీ విన్ వాళ్ల కోసం ‘ఏనుగుతొండం ఘటికాచలం’ అనే కామెడీ వెబ్ ఫిలిం తీసిన రవిబాబు.. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్తో రాబోతున్నాడు. ఆ చిత్రమే.. రేజర్(razor telugu movie).
ఎప్పట్లాగే సైలెంటుగా సినిమా తీసేసి విడుదలకు సిద్ధం చేశాడు రవిబాబు. ఇందులో లీడ్ రోల్ చేసింది రవిబాబే కావడం విశేషం. ఐతే ఇప్పటిదాకా రవిబాబు తీసిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నం. వయొలెంట్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా చేశాడు రవిబాబు. ఇంతకుముందు చిన్న టీజర్తోనే ఇది ఫుల్ వయొలెంట్(violence) మూవీ అని అర్థమైంది. ఇప్పుడు ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. అందులో వయొలెన్స్ డోస్ మామూలుగా లేదు. మనుషుల్ని ఎన్నెన్ని ఆయుధాలతో, ఎన్నెన్ని రకాలుగా చంపొచ్చని డెమో ఇచ్చినట్లుగా ఉంది ఈ ట్రైలర్ చూస్తే. మూడు నిమిషాల ట్రైలర్లో రెండున్నర నిమిషాలు మనుషులను నానా రకాలుగా హింసించి చంపడమే చూపించారు.
ఈ మధ్య విశ్వక్సేన్ సినిమా కల్ట్లో కూడా ఇలాంటి విపరీతమైన హింసే కనిపించింది. ఈ తరం ప్రేక్షకులు హింసను బాగా ఇష్టపడుతున్నారన్న అభిప్రాయంతో ఇలాంటి సినిమాలు తీస్తున్నారేమో కానీ.. వయొలెన్స్ డోస్ భరించలేని స్థాయికి వెళ్లిపోతోందన్నది స్పష్టం. ట్రైలర్లో ఏ క్రేజీ ఎలిమెంట్స్ లేకుండా కేవలం హింసను మాత్రమే చూపించి ఎలా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తారో చూడాలి మరి. ఒక చిన్న పాపను కాపాడడానికి పెద్ద మాఫియాతో తలపడే వ్యక్తి పాత్రలో రవిబాబు కనిపించనున్నాడీ సినిమాలో. రవిబాబుతో ఎప్పట్నుంచో అసోసియేట్ అయి ఉన్న సురేష్ బాబే ఈ చిత్రాన్ని కూడా నిర్మించారు. రేజర్ మే 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.