ఏపీ రాజధాని అమరావతి(amaravati)కి చట్టబద్ధత అంశంతో పాటు, మావిగన్ వ్యవహారం కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ అంశంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(vijayasaireddy) మరోసారి స్పందించారు. అమరావతి, మావిగన్(mavigun) రెండింటినీ సాయిరెడ్డి తప్పుబట్టారు. రాజధాని ఢిల్లీని ఆదర్శంగా తీసుకొని ఏపీ రాజధాని ఉండాలని ఆయన సూచించారు. ఈ ప్రకారం తన ఎక్స్ ఖాతాలో సాయిరెడ్డి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
‘‘ఢిల్లీ నిర్మాణం గురించి విజయసాయి రెడ్డి విశ్లేషిస్తూ.. "1911లో కేవలం 42.7 చదరపు కిలోమీటర్ల (సుమారు 10,550 ఎకరాలు) విస్తీర్ణంలో ఢిల్లీ నగరాన్ని నిర్మించారు. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, సెంట్రల్ సెక్రటేరియట్ వంటి కీలక భవనాలన్నీ అందులోనే ఉన్నాయి. 1931లో నిర్మాణం పూర్తయ్యే నాటికి రూ.10 కోట్లు ఖర్చయింది. ప్రస్తుత విలువ ప్రకారం ఇది రూ.10,000 కోట్లకు సమానం" అని తెలిపారు. దీనికి భిన్నంగా అమరావతిని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూ.1.5 లక్షల కోట్ల అంచనాతో పూర్తిగా అప్పులపై ఆధారపడి నిర్మించడం ఆర్థికంగా వివేకవంతం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజధానికి అతిపెద్ద ల్యాండ్ బ్యాంకులు, అప్పులు అవసరం లేదని తెలిపారు. స్పష్టమైన లక్ష్యం, దశలవారీ అభివృద్ధి ముఖ్యమని ఆయన అన్నారు. ముందుగా శాసనసభ, సచివాలయం, న్యాయవ్యవస్థ, ప్రభుత్వ కార్యాలయాలు వంటి కీలక మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. రైతులకు ఇస్తామన్న అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదని, భూసేకరణ చట్టం-2013 ప్రకారం అదనపు పరిహారం కూడా అందించలేదని ఆరోపించారు. అంతేగాక పేదలకు కేటాయించిన 50,000 ప్లాట్లను రద్దు చేయడం వల్ల వారికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
అలాగే, వైసీపీ ప్రతిపాదించిన ‘మావిగన్’ నమూనా కూడా సరికాదన్నారు. 100 కిలోమీటర్ల పొడవున రాజధానిని విస్తరించడం వల్ల పరిపాలన సమన్వయం దెబ్బతింటుందని, పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంటుందని పేర్కొన్నారు. ఏపీకి ఏకీకృత, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన రాజధాని అవసరమని విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.’’ అని సాయిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.