తెలుగు సినీ సాహిత్యంలో కొన్ని పాటలు కేవలం వినడానికే కాదు, రికార్డులు సృష్టించడానికి పుడతాయి. అలాంటి ఒక అద్భుతమే `గీత గోవిందం`(Geetha Govindam) చిత్రంలోని “ఇంకేమింకేమింకేం కావాలే” పాట. అప్పట్లో ఈ పాట యూత్ పెదవులపై ఒక మంత్రంలా వెలిగింది. అయితే, ఈ పాట కేవలం పాపులారిటీ పరంగానే కాకుండా, ఆర్థికంగా కూడా ఒక రచయితకు ఏ స్థాయి గౌరవాన్ని తెచ్చిపెడుతుందో ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తాజాగా వెల్లడించారు.
సాధారణంగా ఒక రచయితకు సినిమా సైన్ చేసినప్పుడు పారితోషికం అందుతుంది. కానీ, అనంత శ్రీరామ్(Anantha Sriram) ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించిన ప్రకారం.. ఈ ఒక్క పాట ద్వారానే ఆయనకు ఏకంగా రూ. 19 లక్షల రాయల్టీ లభించిందట. ఇది ఆయన సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ కాకపోవడం విశేషం. డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్‌లో ఈ పాట సాధించిన అపూర్వమైన ఆదరణకు ప్రతిఫలంగా దక్కిన ఆదాయం ఇది. తెలుగు సినిమా చరిత్రలో ఒక లిరికల్ వీడియో 100 మిలియన్ల మార్కును దాటడం ఈ పాటతోనే మొదలైందని ఆయన సగర్వంగా గుర్తుచేసుకున్నారు.
ఈ పాట అంతర్జాతీయ స్థాయిలో చార్ట్‌బస్టర్‌గా నిలవడానికి గల కారణాన్ని అనంత శ్రీరామ్ విశ్లేషించారు. ఈ పాటలోని సాహిత్యం కేవలం ప్రేమలో ఉన్న వారికే కాకుండా, జీవితంలోని ప్రతి విజేతకు అన్వయించుకునేలా ఉండటమే దీని ప్లస్ పాయింట్. ఒక విద్యార్థి ర్యాంకు సాధించినా, ఒక వ్యాపారి లాభాలు గడించినా.. ఆ సంతోషకరమైన క్షణాల్లో “ఇంకేమింకేమింకేం కావాలే” అని పాడుకునేలా సాహిత్యాన్ని మలిచారు. ఈ ‘యూనివర్సల్ అప్పీల్’ వల్లే ఈ పాట పదే పదే ప్లే అవుతూ, రచయితకు నిరంతర ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఇక పాట ఏ సందర్భంలోనైనా ఇమిడిపోయేలా ఉన్నప్పుడు, అది శ్రోతలకు చేరువవడమే కాదు, డిజిటల్ యుగంలో రచయితల తలరాతను కూడా మారుస్తుందని ఈ గీత గోవిందం(Geetha Govindam) మ్యాజిక్ స్పష్టం చేస్తోంది.