పిఠాపురం(Pithapuram) రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన ఫ్లెక్సీల వివాదంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అత్యంత సీరియస్‌గా స్పందించారు. ఈ వ్యవహారంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో భేటీ అయిన బాబు.. నియోజకవర్గ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు గట్టి హెచ్చరికలే జారీ చేశారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పిఠాపురంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యటన సందర్భంగా వెలసిన ఫ్లెక్సీలు, అక్కడ జరిగిన ప్రోటోకాల్ రచ్చపై చంద్రబాబు ఆరా తీశారు. ప్రభుత్వ ప్రతిష్టను పెంచాల్సిన బాధ్యత ఉన్న నేతలే.. చిన్న చిన్న ఫ్లెక్సీల కోసం వీధికి ఎక్కడం ఏంటి? అంటూ బాబు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కేవలం ఒక మిత్రపక్ష నేత మాత్రమే కాదని, ఆయన రాష్ట్ర డిప్యూటీ సీఎం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని బాబు స్పష్టం చేశారు. ప్రోటోకాల్ పేరుతో అనవసర రచ్చ చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇది కూటమి ఐక్యతకు ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు.
పిఠాపురంలో రేగిన ఫ్లెక్సీల చిచ్చుకు రాజకీయ ఇగోలే ప్రధాన కారణమని టీడీపీ(TDP) అగ్ర నాయకత్వం నిర్ధారణకు వచ్చింది. వర్మ, జనసేన నేత దొరబాబుల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న ఆధిపత్య పోరు వల్లే ఈ అపశ్రుతులు దొర్లుతున్నాయని చంద్రబాబు గుర్తించారు. ఫోటోలు లేవు.. ప్రోటోకాల్ లేదు వంటివి కేవలం సాకులు మాత్రమేనని, క్షేత్రస్థాయిలో విభేదాలను పక్కనపెట్టి చేతులు కలపకపోతే కుదరదని ఆయన తేల్చి చెప్పారు. అసమ్మతి ఏమైనా ఉంటే నాలుగు గోడల మధ్యే తేల్చుకోవాలని, రోడ్డెక్కి రచ్చ చేస్తే ప్రతిపక్షాలకు రాజకీయ మైలేజీ ఇచ్చినట్లు అవుతుందని బాబు గట్టిగా హెచ్చరించారు.
ఈ వివాదాన్ని వెంటనే చక్కదిద్దే బాధ్యతను పల్లా శ్రీనివాస్‌కు చంద్రబాబు(Chandrababu) అప్పగించారు. "పిఠాపురం అనేది రాష్ట్రానికే ఒక రాజకీయ నమూనా కావాలి. అక్కడ ఇరు పార్టీల నేతలు పాలు-నీళ్లలా కలిసి ఉండాలి" అని బాబు దిశా నిర్దేశం చేశారు. పవన్ కల్యాణ్ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి విచ్ఛిన్నకర చర్యలు అస్సలు సహించబోమని, వెంటనే వర్మతో మాట్లాడి గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికించాలని పల్లాను ఆదేశించారు.