బై బై అమెరికా.. 40 శాతం ఇండియన్స్‌ వెనక్కి?

admin
Published by Admin — April 23, 2026 in International
News Image

ఒకప్పుడు అమెరికా(America) కల అంటే భారతీయులకు ఒక ఎమోషన్. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయినా, విద్యార్థి అయినా ఒక్కసారైనా అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలని కలలు కనేవారు. కానీ ఇప్పుడు ఆ సీన్ వేగంగా మారుతోంది. విదేశీ గడ్డపై రాజభోగం అనుభవించాలనుకున్న ప్రవాసుల ఆలోచనల్లో ఊహించని మార్పు వస్తోంది. నిన్నటి వరకు స్వర్గధామంగా కనిపించిన అమెరికా, నేడు భారతీయులకు ఆందోళనల నిలయంగా మారుతోంది. తాజాగా కార్నెగీ ఎండోమెంట్ సర్వే వెల్లడించిన గణాంకాలు ప్రవాస భారతీయుల మదిలో మారుతున్న ఆలోచనలకు అద్దం పడుతున్నాయి.

డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘అమెరికా ఫస్ట్’ నినాదాన్ని మరింత ఉధృతం చేశారు. ఇది వలసదారుల్లో, ముఖ్యంగా భారతీయ సమాజంలో తీవ్ర అభద్రతా భావాన్ని నింపింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 71 శాతం మంది ట్రంప్ పాలన పట్ల తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ మార్పుల వల్లనే దాదాపు 58 శాతం మంది ప్రవాసులు అమెరికాను వీడి స్వదేశానికి లేదా ఇతర సురక్షిత దేశాలకు వెళ్లాలని గట్టిగా ఆలోచిస్తున్నారు.

అమెరికాను వీడాలనుకోవడానికి కేవలం రాజకీయాలే కారణం కాదు.. ఆర్థిక, వ్యక్తిగత కారణాలు కూడా బలంగా ఉన్నాయి. అక్కడ ఆకాశాన్నంటుతున్న జీవన వ్యయం కారణంగా 54 శాతం మంది బతుకు భారమైందని భావిస్తున్నారు. దీనికి తోడు వ్యక్తిగత భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు (41 శాతం) వారిని మరింత కుంగదీస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా అనిపించిన అమెరికన్ వీధులు, ఇప్పుడు అస్థిరతకు వేదికలుగా మారుతున్నాయన్నది మెజారిటీ భారతీయుల(Indians) అభిప్రాయం.

చట్టబద్ధంగా అమెరికాలో ఉండాలనుకునే వారికి కూడా ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ(H1B) వీసాలపై తీసుకొచ్చిన కఠిన నిబంధనలు ఐటీ ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. లక్ష డాలర్ల భారీ ఫీజు నిబంధన అమలులోకి రావడంతో, కంపెనీలు భారతీయులను నియమించుకోవడానికి వెనుకడుగు వేస్తున్నాయి. గత ఏడాదిలోనే హెచ్1బీ వీసాల జారీ 25 శాతం మేర తగ్గిపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. కంపెనీల నుండి వచ్చే పిటిషన్లు ఏకంగా 87 శాతం పడిపోవడంతో.. అమెరికాలో భారతీయ టాలెంట్‌కు ఇక ఆదరణ తగ్గిపోతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అమెరికా(America)లో ఉన్న 54 లక్షల మంది భారతీయులు ఆ దేశ జనాభాలో కేవలం 1.5 శాతమే అయినా, అక్కడి ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, మారుతున్న పరిస్థితుల రీత్యా ప్రతి 10 మందిలో నలుగురు భారతీయులు వెనక్కి రావాలని అనుకోవడం రాబోయే రోజుల్లో పెద్ద మార్పులకే సంకేతం.  

Tags
American Dream Indian Diaspora H1B Visa Reverse Migration US Politics Donald Trump
Recent Comments
Leave a Comment

Related News