12 ఏళ్ల తర్వాత విడ్డూరం.. తెలంగాణ వ‌ద్దంటూ నినాదం!

admin
Published by Admin — April 23, 2026 in Politics, Telangana
News Image

కాలచక్రం వెనక్కి తిరుగుతోందా? లేక ఉన్న ఊరు.. ఉమ్మడి రాష్ట్రం మీద ప్రేమ అకస్మాత్తుగా పుట్టుకొచ్చిందా? తెలంగాణ(Telangana) ఉద్యమ గడ్డపై ఇప్పుడు వినిపిస్తున్న నినాదాలు చూస్తుంటే ఎవరికైనా బుర్ర తిరిగిపోవాల్సిందే. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడి, కొట్లాడి సాధించుకున్న గడ్డ మీద.. పుష్కర కాలం గడవక ముందే "తెలంగాణ వద్దురా.. ఉమ్మడి ఆంధ్రా ముద్దురా" అనే నినాదం వినబడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

ఉద్యమాల పురిటిగడ్డ హుజూరాబాద్‌లో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. ఆర్టీసీ(RTC) కార్మికులు తమ 42 డిమాండ్ల కోసం రోడ్డెక్కితే, అక్కడ వినిపించిన స్లోగన్లు మాత్రం రాజకీయ విశ్లేషకులను సైతం షాక్‌కు గురిచేస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ 39 డిమాండ్లను దాదాపు ఓకే చేసినా, అసలు సమస్య అది కాదు బాసూ.. అన్నట్లుగా కార్మికులు సరికొత్త పల్లవి అందుకున్నారు. ముఖ్యంగా మహిళా కార్మికులు గొంతు కలపడం గమనార్హం. "ఉమ్మడి రాష్ట్రంలోనే ఆర్టీసీ కళకళలాడేది.. ఇప్పుడు తెలంగాణ వచ్చాక అది తిరోగమనంలో పడింది" అంటూ వారు చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

పన్నెండేళ్ల కిందట తెలంగాణ(Telangana) రాకపోతే ప్రాణాలైనా ఇస్తాం అన్న అదే నేల మీద.. ఇప్పుడు తెలంగాణ వద్దు అనే మాట వినిపించడం వెనుక ఉన్న అసలు మర్మమేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. బహుశా, ప్రభుత్వాల మీద ఉన్న కోపాన్ని ప్రదర్శించడానికి ఇంతకంటే వయొలెంట్ నినాదం మరొకటి దొరకలేదేమో అని సామాన్యులు చెవులు కొరుక్కుంటున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించేలా ఉన్న ఈ నినాదం వెనుక రాజకీయ వ్యూహాలున్నాయా? లేక నిజంగానే కార్మికుల కడుపు మండి అన్న మాటలా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇక రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister PonnamPrabhakar) ఎంత బుజ్జగించినా, కార్మికులు మాత్రం మెట్టు దిగడం లేదు సరికదా.. సరికొత్త అస్త్రాలను సంధిస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్రా పాలకుల పాలన వద్దు అని నినదించిన గొంతులే, ఇప్పుడు అప్పుడే బాగుండేది అనడం పాలకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఏది ఏమైనా, హుజూరాబాద్ డిపో ముందు వినిపించిన ఈ నినాదం.. అటు కేబినెట్‌లోనూ, ఇటు టీవీ డిబేట్లలోనూ మంటలు రేపుతోంది.  

Tags
Telangana RTC Strike Huzurabad Revanth Reddy Telangana News CM Revanth Reddy
Recent Comments
Leave a Comment

Related News