రాజమండ్రి: మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ(YCP) ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. గత మూడు రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఆయన, చివరకు రాజమండ్రి కోర్టు పరిసరాల్లో పోలీసులకు చిక్కారు. సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనే బలమైన ఆరోపణలతో పోలీసులు ఈసారి పక్కా స్కెచ్ వేసి ఆయనను అదుపులోకి తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
హత్య కేసులో బెయిల్‌పై ఉన్న అనంతబాబు, చట్టం నుంచి తప్పించుకునేందుకు తెర వెనుక భారీ వ్యూహమే రచించినట్లు తెలుస్తోంది. కేసులో కీలకమైన నలుగురు సాక్షులను లోబర్చుకునేందుకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున ఎర చూపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అటు లంచం, ఇటు బెదిరింపులతో కేసును నీరుగార్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలపై పక్కా ఆధారాలు లభించడంతో పోలీసులు కొత్త కేసు నమోదు చేశారు.
అనంతబాబు(Anantha Babu)ను పట్టుకోవడంలో మొదట్లో కొంత జాప్యం జరగడం వెనుక శాఖలోని నల్లగొర్రెలు ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. విచారణాధికారిగా ఉన్న ఓ పోలీసు అధికారి, నిందితుడికి ముందస్తు సమాచారం అందిస్తూ సహాయం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు సదరు అధికారిని తక్షణమే వీఆర్ (VR) కు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తు బాధ్యతలను కొత్త అధికారికి అప్పగించిన వెంటనే పోలీసులు గేర్ మార్చారు.
కొత్త అధికారి నేతృత్వంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి అనంతబాబు కదలికలను నిశితంగా పరిశీలించారు. ఆయన రాజమండ్రి కోర్టు(Rajahmundry Court) వద్దకు వస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు అక్కడ మాటు వేశాయి. తప్పించుకునే అవకాశం లేకుండా చుట్టుముట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఈ అరెస్టుతో సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ మళ్లీ వేగవంతం కానుంది.