రాజకీయం అంటే అధికారం మాత్రమే కాదు.. సామాజిక మార్పుకు ఒక వేదిక అని నిరూపించారు గుంటూరు పశ్చిమ టీడీపీ(TDP) ఎమ్మెల్యే గల్లా మాధవి. ట్రాన్స్‌జెండర్ల పట్ల సమాజంలో ఉన్న వివక్షను చెరిపివేస్తూ ఆమె తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత సహాయకులుగా (PA) అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులను లేదా నమ్మకస్థులను నియమించుకుంటారు. కానీ గల్లా మాధవి మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఒక ట్రాన్స్‌జెండర్ మహిళకు ఆ బాధ్యతలు అప్పగించారు.
బీకాం పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్న ఆమె ప్రతిభను గుర్తించి, గౌరవప్రదమైన జీవనోపాధిని కల్పించి ఒక గొప్ప ఆదర్శానికి తెరతీశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, చేతల్లో సామాజిక సాధికారతను చూపిస్తూ ఆమె వేసిన ఈ అడుగు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద, రైళ్లలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న అవమానాలు, కష్టాలను చూసి తాను ఎంతో చలించిపోయానని గల్లా మాధవి పేర్కొన్నారు. చదువుకున్నా కూడా వారికి సరైన అవకాశాలు లభించకపోవడం వల్లే వారు భిక్షాటన వైపు వెళ్తున్నారని గుర్తించిన ఆమె, ఆ చైన్‌ను తెంచాలని నిర్ణయించుకున్నారు. వారికి కేవలం సానుభూతి కాదు.. గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని గల్లా మాధవి(Galla Madhavi) వివరించారు.
ఇక గల్లా మాధవి నిర్ణయంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ప్రత్యేకంగా స్పందించారు. అణగారిన వర్గాలకు అండగా నిలవడమే నిజమైన నాయకత్వ లక్షణమని, గల్లా మాధవి సమాజానికి ఒక గోల్డెన్ స్టాండర్డ్ సెట్ చేశారని ఆయన కొనియాడారు. కేవలం ఎమ్మెల్యే కార్యాలయానికే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌జెండర్ల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం గమనార్హం.