రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వామ్యులు కావాలని నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతేక ప్రతినిధి కోమటి జయరాం పిలుపునిచ్చారు. విద్యా, వైద్య సేవలను పేద ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తోడ్పడాలని కోరారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మెట్రో వర్జీనియాలో కోమటి జయరాంను ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. ఈ అభినందన సభకు భాను మాగులూరి అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ తర్వాత అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా జయరాం మాట్లాడుతూ అమరావతికి చట్టబద్దత కల్పించిన తర్వాత NRI లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకువస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకురాబోతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో చంద్రబాబు,పవన్ కళ్యాణ్,లోకేష్ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువచ్చి పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు.
అమెరికాలో తెలుగుజాతి ఐక్యత కోసం, అభ్యున్నతి కోసం జయరాం కోమటి చేసిన కృషి మరువలేనిదని తానా అధ్యక్షులు నరేన్ కొడాలి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ పాఠశాలల్లో సాంకేతిక విద్యను అందించడానికి డిజిటల్ లేబొరేటరీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
TANA అధ్యక్షులుగా, NRI టీడీపీ కో-ఆర్డినేటర్ గా, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, జయరాం కోమటి అందించిన సేవలు మరుపురానివని గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు కొనియాడారు. అమెరికాలో ఉన్న తెలుగువారికి అండగా నిలబడి వారి సమస్యల పరిష్కరంలో ఆయన భాగస్వామిగా నిలిచారని ప్రశంసించారు.
అమెరికాలో భారతీయులు ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారని, వారి ప్రయోజనాలు కాపాడడంలో జయరాం ముందు వరసలో నిలిచారని USA బీజేపీ అధ్యక్షులు అడపా ప్రసాద్ అన్నారు.
కూటమి ప్రభుత్వ మైత్రి, రాష్ట్ర ప్రగతి ఇక ముందూ కొనసాగాలని జనసేన పార్టీ ప్రతినిధులు విజయ్ గుడిసేవ, వేణు పులిగుజ్జు చెప్పారు. జయరాం కోమటితోపాటు ప్రవాస సంఘాల పెద్దలకు టీడీపీ ప్రతినిధులు సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, సాయి బొల్లినేని అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రవాస సంస్థ ఆటా ప్రతినిధులు కవిత చల్లా GWTCS అధ్యక్షులు రవి అడుసుమిల్లి, సాయిసుధా పాలడుగు, సతీష్ చింత, సత్యనారాయణ మన్నె, త్రిలోక్ కంతేటి, కృష్ణప్రియ అడుసుమిల్లి, కంచర్ల కిషోర్, పద్మజ బేవర, నాగ్ నెల్లూరి, జానకి బోగినేని తదితర ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.