తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ కష్టాలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. బంకుల వద్ద గంటల తరబడి వేచి చూడటం, స్టాక్ లేక ఖాళీ చేతులతో వెనుతిరగడం నిత్యకృత్యంగా మారింది. ఈ ఇంధన సంక్షోభాన్ని ఒక అద్భుతమైన వ్యాపార అవకాశంగా మలుచుకుంది ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్(Airtel). ప్రజల అవసరాన్ని గుర్తిస్తూ, తమ కస్టమర్ బేస్‌ను పెంచుకోవడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక క్రేజీ ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా దమ్మపేట మండలంలో ఎయిర్‌టెల్ ప్రతినిధులు ఈ వినూత్న ప్రచారాన్ని చేపట్టారు. సాధారణంగా కొత్త సిమ్ తీసుకుంటే డేటా లేదా టాక్ టైమ్ ఆఫర్లు ఇస్తుంటారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తమ నెట్‌వర్క్‌లోకి వచ్చే కొత్త వినియోగదారులకు ఏకంగా లీటర్ పెట్రోల్‌ను ఉచితంగా అందిస్తున్నారు. పెట్రోల్ కోసం అల్లాడుతున్న వాహనదారులకు ఈ ఆఫర్ ఒక ఊరటలా అనిపించడంతో, ఎయిర్‌టెల్ కౌంటర్ల వద్ద జనాలు క్యూ కడుతున్నారు.
ఈ ఆఫర్ పొందడానికి కస్టమర్లు తమ పాత నెట్‌వర్క్ నుంచి ఎయిర్‌టెల్‌కు పోర్ట్ అవ్వడమో లేదా కొత్త కనెక్షన్ తీసుకోవడమో చేయాల్సి ఉంటుంది. రూ.350 విలువైన రీచార్జ్‌తో పాటు ఒక లీటర్ పెట్రోల్(Petrol)ను కానుకగా ఇస్తున్నారు. ఒకవైపు మొబైల్ రీచార్జ్ అవ్వడంతో పాటు, మరోవైపు సుమారు వంద రూపాయల విలువైన పెట్రోల్ ఉచితంగా వస్తుండటంతో స్థానికులు ఈ డీల్‌పై మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం ఈ పెట్రోల్ మార్కెటింగ్ స్ట్రాటజీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏదైనా కష్టం వస్తే దాన్ని క్యాష్ చేసుకోవడం అంటే ఇదే అంటూ నెటిజన్లు పెదవి విరుస్తూనే, ఎయిర్‌టెల్(Airtel) ప్రతినిధుల తెలివితేటలను మెచ్చుకుంటున్నారు. కొరతను కూడా లాభంగా మార్చుకోవచ్చని ఈ వినూత్న ప్రయోగం నిరూపించింది.