ప్రముఖ నటుడు సత్యరాజ్(Sathyaraj) కుమార్తె దివ్య సత్యరాజ్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. వృత్తిరీత్యా న్యూట్రిషనిస్ట్‌గా గుర్తింపు పొందిన ఆమె, తాజాగా తన వ్యక్తిగత జీవితం, సమాజంలోని కట్టుబాట్లపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. సంప్రదాయాలకు, పాత ఆలోచనలకు భిన్నంగా ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి.
సాధారణంగా వివాహ బంధంలో తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి ఆచారాలను పవిత్రంగా భావిస్తారు. అయితే, దివ్య సత్యరాజ్(Divya Sathyaraj) మాత్రం వీటిని భిన్నంగా చూస్తున్నారు. కేవలం ఈ సంప్రదాయాల వల్లే బంధం బలపడుతుందని తాను నమ్మనని ఆమె స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తులు మనస్పూర్తిగా ఇష్టపడితే, కలిసి జీవించడానికి పెళ్లి అనే సామాజిక ముద్ర అవసరమే లేదని ఆమె అభిప్రాయపడ్డారు. బంధానికి ప్రాతిపదిక ప్రేమ మాత్రమే కానీ, ఆచారాలు కాదని ఆమె వాదన.
వివాహం గురించి చెబుతూనే, మాతృత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. పిల్లలను కనాలంటే కచ్చితంగా పెళ్లి(Marriage) చేసుకోవాలనే నిబంధనను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు దివ్య తెలిపారు. "ఒకవేళ నాకు తల్లిని కావాలని అనిపిస్తే, వివాహం చేసుకోకుండానే ఆ బాధ్యతను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని ఆమె కుండబద్దలు కొట్టారు.
ఇక తన ఆలోచనా దృక్పథానికి తన తండ్రి సత్యరాజ్ స్ఫూర్తి అని ఆమె పేర్కొన్నారు. "మా నాన్న నాస్తికుడు. అందుకే నాకు కనీసం జాతకం కూడా రాయించలేదు. గ్రహాలు మన జీవితాన్ని శాసిస్తాయని నేను అస్సలు నమ్మను" అని ఆమె వెల్లడించారు. తన సంతోషం తప్ప వేరే ఏదీ తన తండ్రికి ముఖ్యం కాదని, ఆయన తనకు ఇచ్చిన స్వేచ్ఛ పట్ల ఎంతో గర్వంగా ఉందని దివ్య సత్యరాజ్ సగర్వంగా పేర్కొనడం విశేషం. కాగా, నేటి తరం ఆలోచనలకు ప్రతిరూపంగా దివ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ నుంచి టాలీవుడ్(Tollywood) వరకు హాట్ టాపిక్‌గా మారాయి.