అమరావతి: ఏపీ(AP)లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాలనలో తన మార్క్ చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు సొంత పార్టీ నేతల విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. తాజాగా జరిగిన టీడీపీ కార్యవర్గ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. "అధికారం వచ్చింది కదా అని అహంతో ఊగిపోతే సహించేది లేదు.. అతి చేస్తే ఇంటికే" అంటూ పరోక్షంగా తెలుగు తమ్ముళ్లకు గట్టి హెచ్చరికలే జారీ చేశారు.
పార్టీ కోసం కష్టపడిన వారిని గౌరవిస్తాం కానీ, పెత్తనం చెలాయిస్తామంటే కుదరదని బాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రోటోకాల్ విషయంలోనూ, చిన్న చిన్న ఫ్లెక్సీలు, కుర్చీల దగ్గర గొడవలు పడటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "మనం సుపరిపాలన అనే యజ్ఞం చేస్తున్నాం. ఇలాంటి సమయంలో నేతల ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం" అని బాబు తేల్చి చెప్పారు. గత పాలకుల పతనం వారి అహంకారం వల్లే జరిగిందని, ఆ తప్పును మనం రిపీట్ చేయకూడదని నేతలకు హితవు పలికారు.
జనసేన, బీజేపీ నేతలతో సమన్వయం విషయంలో చంద్రబాబు అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. "నేను, పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎంతో అవగాహనతో, సఖ్యతతో ముందుకు వెళ్తున్నాం. మా మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. మరి కింద స్థాయిలో నేతలు ఎందుకు ఇగోలకు పోతున్నారు?" అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య విభేదాలు ఉండకూడదని, కూటమి ధర్మాన్ని పాటించని వారు పార్టీలో ఉండటానికి వీల్లేదని బాబు అల్టిమేటం ఇచ్చారు. దాడులు, సెటిల్మెంట్లకు దూరంగా ఉండి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు(Chandrababu) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు మనకిచ్చిన భారీ మెజారిటీని అలుసుగా తీసుకోకుండా, ప్రతి కార్యకర్త వినయంతో ప్రజల వద్దకు వెళ్లాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పని చేయాలని, ఈ లోపు వివాదాలకు తావు లేకుండా జాగ్రత్త పడాలని పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. క్రమశిక్షణే పార్టీకి శ్రీరామరక్ష అని, దాన్ని ఎవరు అతిక్రమించినా ఉపేక్షించేది లేదని చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేశారు.