తెలంగాణ రాజకీయాల్లో మూడ్ ను బట్టి రూట్ మార్చడంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) తర్వాతే ఎవరైనా.నిన్నటి దాకా కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేస్తానని శపథాలు చేసిన ఈ మునుగోడు లీడర్.. ఇప్పుడు అదే కుటుంబంపై అకస్మాత్తుగా నైతికత యుద్ధం మొదలుపెట్టారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టి తన తండ్రిపైనే విమర్శలు గుప్పించడాన్ని రాజగోపాల్ రెడ్డి అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆయన కవితపై చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి.
మీడియా ముందుకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. కవిత(Kavitha)పై విమర్శలు చేయడంలో రాజకీయ సరిహద్దులు దాటేశారు. "కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు? తండ్రిని గౌరవించని వ్యక్తి.. రేపు సమాజానికి అమ్మగా ఎలా మారుతుంది?" అంటూ ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవైపు లిక్కర్ స్కామ్ అంశాన్ని ప్రస్తావిస్తూనే, మరోవైపు కేసీఆర్‌ను ఉద్యమకారుడిగా కీర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కవితకు అసలు డిపాజిట్లు కూడా రావని, ఆమె వల్ల ఏమీ కాదంటూనే.. తండ్రిపై ఆమె చేసిన విమర్శలను తాను సహించలేకపోతున్నానని ఆయన చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్.
అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్(KCR) పట్ల ఈ స్థాయిలో సానుభూతి చూపడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. సాధారణంగా కవిత తిరుగుబాటు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు ఎంజాయ్ చేయాలి. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం "కేసీఆర్‌ను విమర్శిస్తుంటే నాకు బాధేస్తోంది.." అని స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఆయన మాటలు వింటుంటే.. కవితను తిట్టే నెపంతో, కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ జెండా చేతిలో ఉన్నా, మనసు మాత్రం కారు షెడ్డు వైపు చూస్తోందా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
కవిత తన అన్నపై ఉన్న కోపాన్ని తండ్రిపై చూపిస్తోందని రాజగోపాల్ రెడ్డి విశ్లేషిస్తున్నారు. అయితే, ఆ ఇంట్లో గొడవలకు ఈయన మధ్యవర్తిలా ఎందుకు ఫీలవుతున్నారనేదే మిస్టరీ. ఒకవైపు కవిత రాజకీయ భవిష్యత్తు శూన్యం అంటూనే, ఆమె నైతికతను ప్రశ్నించడం ద్వారా ఆయన అటు కేసీఆర్ అభిమానుల మనసు గెలుచుకోవాలని చూస్తున్నారా? లేక బీఆర్ఎస్(BRS) బలహీనపడుతున్న వేళ, ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవాలని చూస్తున్నారా? ఏదేమైనా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయి ఉండి, గులాబీ బాస్ గౌరవం కోసం రాజగోపాల్ రెడ్డి పడుతున్న ఆరాటం తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టించింది.