తమిళనాట కొత్త రాజకీయ చరిత్రకు తెరలేపిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత విజయ్, తన తదుపరి అడుగుతో అందరినీ ఆశ్చర్యపరచబోతున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్లా భారీ మెజారిటీతో గెలిచిన ఆయన.. చట్టపరమైన నిబంధనల ప్రకారం తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ ఖాళీ అయ్యే స్థానంలో విజయ్ సన్నిహితురాలు, స్టార్ హీరోయిన్ త్రిష పోటీ చేస్తారని కోలీవుడ్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకు జోరుగా ప్రచారం సాగింది. అభిమానులు కూడా దళపతి పక్కన కుందవై రాజకీయ అరంగేట్రం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. కానీ, అనూహ్యంగా విజయ్ తన రూట్ మార్చి త్రిషకు షాక్ ఇచ్చారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
సినిమా గ్లామర్ కంటే పరిపాలనా దక్షత ఉన్నవారికే తన పార్టీలో పెద్దపీట వేయాలని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అవినీతిపై రాజీలేని పోరాటం చేసిన మాజీ ఐఏఎస్ అధికారి సగాయం పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రానైట్ కుంభకోణాన్ని వెలికితీసి, ప్రజల్లో నిజాయితీ గల అధికారిగా ముద్ర వేసుకున్న సగాయంను బరిలోకి దింపడం ద్వారా.. తన ప్రభుత్వం కేవలం ప్రజా సేవకే అంకితమని విజయ్(Vijay) ఒక బలమైన సంకేతాన్ని పంపాలని చూస్తున్నారు.

కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడమే కాకుండా, క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలంటే సగాయం వంటి అనుభవజ్ఞుల అవసరం ఎంతో ఉందని విజయ్ నమ్ముతున్నారు. కేవలం ఓట్ల కోసం సెలబ్రిటీలను నమ్ముకోకుండా, వ్యవస్థను మార్చే వ్యక్తులకు అవకాశం ఇవ్వాలనే దళపతి నిర్ణయాన్ని మేధావులు స్వాగతిస్తున్నారు. విజయ్ అధికారికంగా తిరుచ్చి ఈస్ట్‌కు రాజీనామా చేసిన వెంటనే, సగాయం అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి త్రిష(Trisha) ఎంట్రీపై ఆశలు పెట్టుకున్న వారికి ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే అయినా, పార్టీ భవిష్యత్తు కోసం విజయ్ తీసుకున్న ఈ బోల్డ్ నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.