ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. 125 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైమ్!

admin
Published by Admin — May 07, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పారిశ్రామిక ఆకాశంలో మరో 'రాయల్' మైలురాయి నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా బుల్లెట్ బైక్‌ల క్రేజ్‌ను సృష్టించిన దిగ్గజ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్, తన భారీ తయారీ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం ఆటోమొబైల్ రంగంలో పెను సంచలనంగా మారింది.

1901లో ప్రస్థానాన్ని ప్రారంభించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. గడచిన 125 ఏళ్లలో ఆ సంస్థ తన ప్రధాన తయారీ కార్యకలాపాలను తమిళనాడుకే పరిమితం చేస్తూ వచ్చింది. అయితే, తొలిసారిగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇంత భారీ స్థాయిలో ప్లాంట్‌ను నిర్మించేందుకు ముందుకు రావడం విశేషం. ఏపీ(AP) ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల కల్పనలో చూపుతున్న వేగం ఈ దిగ్గజ సంస్థను ఆకర్షించినట్లు స్పష్టమవుతోంది.

తిరుపతి జిల్లాలోని సత్యవేడు ఈ మెగా ప్రాజెక్టుకు వేదిక కానుంది. సుమారు 267 ఎకరాల విస్తీర్ణంలో రెండు దశల్లో రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్లాంట్ రూపుదిద్దుకోనుంది. దీని ద్వారా కేవలం బైక్‌ల తయారీ మాత్రమే కాకుండా, ఏకంగా 5,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేతృత్వంలోని ఎస్‌ఐపీబీ (SIPB) ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు వేగవంతం కానున్నాయి.

ఈ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ కేవలం రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) యూనిట్ మాత్రమే కాకుండా, దానికి విడిభాగాలను సరఫరా చేసే వెండర్ పార్క్ కూడా ఏర్పాటు కానుంది. అంటే, ఒకే చోట వందలాది అనుబంధ పరిశ్రమలు కొలువుదీరనున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ ఆటోమొబైల్ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.

రాష్ట్ర ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఈ ప్రాజెక్టుపై హర్షం వ్యక్తం చేస్తూ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి ఐకానిక్ బ్రాండ్ ఏపీకి రావడం రాష్ట్ర ప్రతిష్టను పెంచిందని పేర్కొన్నారు. 2029 నాటికి మొదటి దశ, 2032 నాటికి పూర్తిస్థాయి ప్లాంట్ అందుబాటులోకి వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిణామంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags
Royal Enfield Andhra Pradesh AP Industrial Growth AP News Nara Lokesh Chandrababu Naidu Tirupati
Recent Comments
Leave a Comment

Related News