తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే కేటీఆర్ సెటైర్లతో విరు చుకుపడ్డారు. `` ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. `రేవంత్ రెడ్డి రెగ్యులర్ ముఖ్యమంత్రి కాదు.. రెన్యువల్ ముఖ్యమంత్రి` అని ఎద్దేవా చేశారు. తాజాగా ఆయన బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించిన.. `రైతు సంగ్రామ సదస్సు`లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఇటీవల నల్లగొండలో ఓ రైతు.. తన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు వచ్చి..అక్కడే కుప్పకూలి మరణించారు. ఈ ఘటనను ప్రస్తావించిన కేటీఆర్.. రైతుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి గాలిలో దీపంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. రైతులకు మాయ మాటలు చెప్పి.. మభ్యపెట్టి.. అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. గత ఎన్నికలకు ముందు.. రైతులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలుకాలేదని అన్నారు. ఇచ్చిన అన్ని హామీలను ఎగ్గొట్టారని కేటీఆర్ దుయ్యబట్టారు. `అందుకే.. ఆయన ఎనుముల రేవంత్ రెడ్డి కాదు. ఎగవేతల రేవంత్ రెడ్డి` అని వ్యాఖ్యానించారు. 34 హామీలు ఇచ్చి.. దీనిలో ముక్కాలు కూడా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పేరంటేనే జడుపు!
మాజీ సీఎం కేసీఆర్ పేరు చెబితే ఈ ప్రభుత్వం జడిసిపోతోందని కేటీఆర్ అన్నారు. అందుకే.. కేసీఆర్ బయటకు వచ్చిన ప్రతిసారీ.. ఏదో ఒక కార్యక్రమంతో ముఖ్యమంత్రి, మంత్రులు బయటకు వస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎక్కడైనా సభ పెడితే.. ఆవెంటనే రైతు బంధు నిధులు వేస్తున్నారని.. అది కూడా అరకొరగానే ఇస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అంటే.. ఈ ప్రభుత్వానికి అంత జడుపు పట్టుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గ్యాంగ్ డేంజర్ అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు రైతు బంధు ఇస్తామని.. రుణమాఫీ చేస్తామనిచెప్పారని.. కానీ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు.
రాజీనామా చేస్తా..
తెలంగాణలో రైతులకు ఇవ్వాల్సిన సొమ్ములను ఢిల్లీకి పంపిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ సొమ్ములతో రాహుల్ గాంధీ జేబులు నింపుతున్నారని విమర్శించారు. కేరళలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సొమ్మును ఎంత ఖర్చు పెట్టారో.. ప్రజలకు లెక్కలు చెప్పాలని నిలదీశారు. `రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం.` అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల నెలా కప్పం చెల్లించి.. తన పదవిని రెన్యువల్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసినట్టు ఆధారాలు చూపిస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. కేటీఆర్ సవాల్ రువ్వారు. దీనిని ముఖ్యమంత్రి స్వీకరిస్తారా? అని వ్యాఖ్యానించారు.