తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. 'దళపతి' విజయ్( Thalapathy Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అధికార పీఠం దిశగా వడివడిగ అడుగులు వేస్తోంది. అసాధ్యం అనుకున్న సమీకరణాలను సుసాధ్యం చేస్తూ, విజయ్ తన రాజకీయ చతురతతో మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడమే కాకుండా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. ఈ పరిణామం ద్రవిడ రాజకీయాల్లో ఒక సరికొత్త శకానికి నాంది పలకబోతోంది.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడంలో విజయ్‌కు కీలక పార్టీల మద్దతు లభించింది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి 5 సీట్లు, సీపీఐ నుంచి 2, సీపీఎం నుంచి 2, వీసీకే నుంచి 2 సీట్లు విజయ్ ఖాతాలో చేరాయి. ఈ పార్టీలన్నీ టీవీకే(TVK) వెంటే ఉంటామని సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో విజయ్ శిబిరంలో ఉత్సాహం ఉరకలేస్తోంది. కొద్దిసేపట్లోనే ఈ మద్దతుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
మద్దతు లేఖలు సిద్ధం కావడంతో విజయ్ నేరుగా రాజ్ భవన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నేడు సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు ఆయన ఇప్పటికే అపాయింట్‌మెంట్ కోరారు. తనకున్న బలాన్ని నిరూపించే మద్దతు లేఖలను గవర్నర్‌కు అందజేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. ఈ భేటీ ముగిసిన వెంటనే తమిళనాట(Tamil Nadu) కొత్త ప్రభుత్వం కొలువుదీరడంపై స్పష్టత రానుంది.
దశాబ్దాల పాటు రెండు ప్రధాన ద్రవిడ పార్టీల మధ్యే తిరిగిన తమిళ రాజకీయాలు, ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం వైపు మళ్లాయి. వామపక్షాలు, వీసీకే వంటి సామాజిక దృక్పథం ఉన్న పార్టీలు విజయ్‌కు అండగా నిలవడం గమనార్హం. కేవలం సినీ గ్లామర్‌తోనే కాకుండా, బలమైన రాజకీయ మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే తమిళనాట విజయ్(Vijay) మార్క్ పాలన మొదలుకానుంది.