CMగా విజ‌య్‌.. తొలి సంత‌కం ఆ ఫైల్‌పైనే..!

admin
Published by Admin — May 10, 2026 in Politics, National
News Image

తమిళనాడు రాజకీయాల్లో  తమిళగ వెట్రి కళగం (TVK) ప్ర‌భుత్వం కొలువుతీరింది. వెండితెరపై ‘దళపతి’గా కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న జోసెఫ్ విజయ్, ఇప్పుడు నిజ జీవితంలో ప్రజా నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.  ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ ఉదయం 10 గంటలకు అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, విజయ్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్(Vijay) తనదైన ముద్ర వేస్తూ కీలక సంక్షేమ పథకాలపై సంతకాలు చేశారు. తన ఎన్నికల హామీలను నెరవేరుస్తూ, ఆయన తొలి సంతకాన్ని ఉచిత కరెంట్ ఫైల్‌పైనే చేశారు. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరటనిస్తూ తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే కీలక నిర్ణయానికి ఆయన ఆమోదం తెలిపారు. పాలనలో తన ప్రాధాన్యత సామాన్యులేనని ఈ తొలి సంతకంతో విజయ్ స్పష్టం చేశారు.

మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన విషయంలో రాజీ పడేది లేదని విజయ్(Vijay) చాటిచెప్పారు. ఆయన చేసిన రెండో సంతకం మహిళల భద్రతకు సంబంధించింది. మహిళల రక్షణ కోసం గతంలోనే విజయ్ అనేక హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 'షీ టీమ్స్' తరహాలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనితో పాటు మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ సంబంధిత ఫైల్‌పై సీఎం సంతకం చేశారు.

యువతను పీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు ముఖ్యమంత్రి విజయ్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ తరహా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక విభాగం ద్వారా డ్రగ్స్ రహిత తమిళనాడును నిర్మిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇలా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ప్రజాకర్షక పథకాలతో పాటు, సామాజిక సమస్యల పరిష్కారంపై సంతకాలు చేయడంతో తమిళనాడు(Tamil Nadu) రాజకీయాల్లో సరికొత్త వేగం మొదలైంది.

Tags
CM Vijay Thalapathy Vijay TVK Tamil Nadu Politics TN Govt Free Electricity
Recent Comments
Leave a Comment

Related News