తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. వెండితెరపై రికార్డులు తిరగరాసిన దళపతి విజయ్(Thalapathy Vijay), ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టి రాజకీయ రికార్డులను కూడా తిరగరాస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే విజయ్ సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు. సాధారణంగా రాజకీయాల్లో గెలిచిన తర్వాత ప్రత్యర్థులను విమర్శించడం లేదా పక్కన పెట్టడం చూస్తుంటాం. కానీ, విజయ్ మాత్రం ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే నేరుగా మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ నివాసానికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు.

విజయ్ రాకతో చెన్నైలోని స్టాలిన్(MK Stalin) నివాసం సందడిగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు స్టాలిన్ ఆత్మీయ స్వాగతం పలికారు. విజయ్‌ను సాదరంగా ఆహ్వానించి, శాలువాతో సత్కరించి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు వేరైనా, వ్యక్తిగత గౌరవం, మర్యాదలు ముఖ్యమని వీరిద్దరి భేటీ చాటిచెప్పింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొనడం విశేషం. ముగ్గురు కీలక నేతలు ఒకే చోట కనిపించడంతో తమిళ రాజకీయ వర్గాల్లో ఈ ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

విజయ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడంలో డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీల మద్దతు కీలకంగా నిలిచింది. టీవీకే(TVK) పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో తన మిత్రపక్షాలకు స్టాలిన్ పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం విజయ్‌కు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో, తన విజయానికి పరోక్షంగా సహకరించిన పెద్దన్నకు కృతజ్ఞతలు చెప్పడమే లక్ష్యంగా విజయ్ ఈ భేటీని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దూకుడుగా ఉండే రాజకీయాల మధ్య ఇలాంటి గౌరవప్రదమైన భేటీలు తమిళ పాలిటిక్స్‌లో సరికొత్త సంప్రదాయానికి నాంది పలుకుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.