తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్ చుట్టూ తిరుగుతున్న వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఒక మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో భగీరథ్‌పై పోలీసులు పోక్సో (POCSO) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకున్న భగీరథ్, ఈసారి అత్యంత కఠినమైన చట్టం కింద విచారణ ఎదుర్కోవాల్సి రావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సాధారణంగా ఇలాంటి రాజకీయ సెన్సిటివ్ అంశాల్లో సినీ గ్లామర్ ఇండస్ట్రీ చాలా వరకు మౌనంగానే ఉంటుంది. అధికారంలో ఉన్న వారితో ఎందుకు గొడవ అని చాలామంది హీరోలు వెనకడుగు వేస్తారు. కానీ, ఎప్పుడూ సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే మంచు మనోజ్(Manchu Manoj), ఈ విషయంలో అందరికంటే ముందుగా స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మౌనం వీడి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
బండి భగీరథ్(Bandi Bhagirath)పై నమోదైన పోక్సో కేసు గురించి తెలుసుకున్న మనోజ్, ఈ ఇష్యూపై సోషల్ మీడియా వేదికగా తన గొంతు వినిపించారు. "కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన ఇటీవలి పోక్సో కేసు నన్ను తీవ్రంగా కలవరపరిచింది" అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే, అధికారం, హోదా లేదా పలుకుబడి ఉన్నంత మాత్రాన బాధితులకు న్యాయం అందకుండా పోకూడదని ఆయన నొక్కి చెప్పారు. ప్రతి మైనర్ బాలికకు రక్షణగా ఉండటానికే పోక్సో చట్టం ఉందని, ఈ కేసులో ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరగాలని కోరారు.
ఈ విషయంలో మనోజ్(Manoj) తన స్పందనను కేవలం విమర్శగా కాకుండా, ఒక సామాజిక బాధ్యతగా మలిచారు. ఇది ఒక పార్టీకో లేక ఒక వ్యక్తికో సంబంధించిన విషయం కాదని, దేశంలోని న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకానికి సంబంధించినదని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా, తక్షణమే, పారదర్శకంగా విచారణ జరగాలని ఆయన ఆకాంక్షించారు. న్యాయం జరగడమే కాకుండా, అది జరిగినట్లు కనిపించాలని, తద్వారా చట్టానికి ఎవరూ అతీతులు కారని మరోసారి నిరూపించాలని డిమాండ్ చేశారు. కాగా, తోటి సినీ సెలబ్రిటీలు ఇంకా మౌనంగా ఉన్న సమయంలో, మనోజ్ ధైర్యంగా ముందుకు వచ్చి స్పందించడం ఆయన వ్యక్తిత్వాన్ని చాటుతోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మొత్తానికి, కేంద్ర మంత్రి కుమారుడి కేసులో మంచు మనోజ్ ఎంట్రీతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.