జనసేన వర్సెస్ బాలినేని.. సీన్ రివర్స్ అవుతోందా?

admin
Published by Admin — May 11, 2026 in Politics, Andhra
News Image

ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy)కి సొంత గూటిలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. వైసీపీ వీడి గ్లాసు అందుకున్న సమయంలో ఆయనకు లభించిన వెల్కమ్ చూసి, అంతా సులభంగానే ఉంటుందని భావించారు. కానీ, క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్ అవుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల డీలిమిటేషన్ అంశంపై ఆయన నిర్వహించిన భేటీ, జనసేనలోని పాత, కొత్త వర్గాల మధ్య ఉన్న అగాధాన్ని రోడ్డు మీదకు తెచ్చింది.

ఒంగోలు(Ongole) రాజకీయాల్లో పట్టున్న నేతగా బాలినేనికి అధిష్టానం ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, పార్టీ కేడర్‌ను కలుపుకుపోవడంలో ఆయన వ్యూహం బెడిసికొడుతున్నట్లు కనిపిస్తోంది. జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ వంటి కీలక నేతలను పట్టించుకోకుండా, కేవలం తన అనుచర వర్గంతోనే సమీక్షలు నిర్వహించడం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. పార్టీ అంటే మేమే అనే ధోరణి బాలినేనిలో కనిపిస్తోందని, కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న తమను పక్కన పెట్టడం ఏంటని రియాజ్ వర్గం వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం జనసేనలో హాట్ టాపిక్ అయ్యింది.

బాలినేని రాకతో తమ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఇబ్బందుల్లో పడుతుందోనన్న ఆందోళన పాత కేడర్‌లో మొదలైంది. ఉమ్మడి ప్రకాశం(Prakasam), నెల్లూరు జిల్లాల బాధ్యతలను భుజాన వేసుకున్న బాలినేని, సమన్వయకర్తగా కాకుండా సుప్రీంలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సీనియర్ నాయకుడిగా అందరినీ ఏకం చేయాల్సింది పోయి, గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు అధిష్టానం దృష్టికి వెళ్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, ఈ అంతర్గత కలహాలు జనసేన(Janasena) విజయ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మేం ఎవరికీ తక్కువ కాదు అంటూ షేక్ రియాజ్ అనుచరులు బాలినేని సమావేశం వద్దే ఆందోళన చేయడం.. జనసేనలో బాలినేని ప్రస్థానం అంత సాఫీగా సాగేలా లేదని సూచిస్తోంది. ఒకవేళ బాలినేని తన పంథా మార్చుకోకపోతే, పాత కేడర్ నేరుగా పవన్ కళ్యాణ్ వద్దే తేల్చుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మరి ఈ రివర్స్ సీన్ ను బాలినేని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

Tags
Janasena Balineni Srinivasa Reddy Pawan Kalyan Ongole Politics Andhra Pradesh AP Politics
Recent Comments
Leave a Comment

Related News