బొత్స రిటైర్మెంట్.. ఇక ఆ బాధ్య‌త‌లు ఆమెకేనా..?

admin
Published by Admin — May 14, 2026 in Politics, Andhra
News Image

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన సీనియర్ నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్దకు చేరుకుందా? గత మూడు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలనే కాకుండా, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన ఈ బిగ్ బాస్ ఇక విశ్రాంతి కోరుకుంటున్నారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. బొత్స అనారోగ్య కారణాలు, వయసు రీత్యా ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది.

గత కొంతకాలంగా బొత్స సత్యనారాయణ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆయన శాసన మండలిలో మాట్లాడుతుండగా తూలిపడబోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇక చాలు అని, విశ్రాంతి తీసుకోవాలని ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఆయనకు జగన్(Jagan) ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, మండలిలో విపక్ష నేత హోదా కల్పించినప్పటికీ.. శారీరక ఇబ్బందుల దృష్ట్యా ఆ బాధ్యతలను నిర్వహించడం ఆయనకు భారంగా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పార్టీ పరంగా బొత్సకు గోదావరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాల పర్యటనలు చేయడం, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడం ఆయన వల్ల కావడం లేదని ఆయన పార్టీ అధిష్టానానికి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. 2027 డిసెంబర్ వరకు ఆయనకు ఎమ్మెల్సీ(MLC) పదవీ కాలం ఉన్నప్పటికీ, విపక్ష నేత హోదాలో సభలో అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను కూడగట్టుకోలేకపోతున్నానని ఆయన జగన్‌తో చెప్పినట్లు టాక్.

బొత్స స్థానంలో మండలిలో విపక్ష నాయకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై జగన్ ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని అదే ప్రాంతానికి చెందిన బీసీ మహిళా నేత వరుదు కల్యాణి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అనకాపల్లి జిల్లాకు చెందిన ఆమె, ప్రస్తుతం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఉంటూనే, మండలిలో ప్రభుత్వంపై గట్టిగా గళం విప్పుతున్నారు. బొత్స వారసులను 2029లో నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారనే వార్తల నేపథ్యంలో, పార్టీ ఆయనకు గౌరవప్రదమైన వీడ్కోలు ఇచ్చి, కల్యాణికి పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా, బొత్స వంటి చాణక్యం కలిగిన నేత తెరమరుగు కావడం ఉత్తరాంధ్రలో వైసీపీ(YCP)కి తీరని లోటుగానే చెప్పాలి.  

Tags
Andhra Pradesh AP Politics YSRCP Botsa Satyanarayana YS Jagan Varudu Kalyani
Recent Comments
Leave a Comment

Related News