సాయిపల్లవికి దక్షిణాదిన గుర్తింపే వేరు. తొలి చిత్రం ‘ప్రేమమ్’తో మలయాళం తెలియని వాళ్లను కూడా ఆమె అమితంగా ఆకట్టుకుంది. భాషతో సంబంధం లేకుండా ఆ చిత్రాన్ని ఆదరించారు. తర్వాత తెలుగులో ‘ఫిదా’ సినిమా చేస్తే ఆమె నటనకు ఫిదా అయిపోయిన మన ప్రేక్షకులు తనను నెత్తిన పెట్టుకున్నారు. తమిళంలో కూడా ఆమెకు మంచి పేరే వచ్చింది. కన్నడలో స్ట్రెయిట్ సినిమా చేయకపోయినా.. పరభాషా చిత్రాలతోనే ఆమె అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.
కానీ దక్షిణాదిన ఇంత పాపులారిటీ సంపాదించిన ఆమెకు బాలీవుడ్లో మాత్రం అరంగేట్రంలో చేదు అనుభవం తప్పలేదు. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన సాయిపల్లవి నటించిన ‘ఏక్ దిన్’ డిజాస్టర్ అయింది. విడుదలకు ముందు రెస్పాన్స్ చూస్తేనే ఆ సినిమా ఫెయిలవడం ఖాయంగా కనిపించింది. రిలీజ్ తర్వాత అనుకున్నదే జరిగింది. ఇదేమీ పనికి రాని సినిమా కాదు. విషయం ఉన్నదే. అయినా ఆడలేదు. సినిమాకు ఇటు హీరో, అటు హీరోయిన్ ఇద్దరూ మైనస్ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తాను ఇందులో కథానాయిక పాత్రకు సూట్ కాలేదని అనిపించిందని స్వయంగా సాయిపల్లవే అభిప్రాయపడింది ఒక ఇంటర్వ్యూలో. సాయిపల్లవి నటన విషయంలో లోపమేమీ లేదు కానీ.. జునైద్ పక్కన ఆమె సెట్ కాలేదన్న అభిప్రాయం ప్రేక్షకుల్లోనూ వ్యక్తమైంది. ఇక హిందీ ఆడియన్స్ నుంచి పెద్ద కంప్లైంట్ ఏంటంటే.. సాయిపల్లవి డబ్బింగ్ పెద్ద మైనస్ అయిందని. సాయిపల్లవి దక్షిణాదిన ఏ భాషలో నటించినా.. తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తొలి చిత్రం ‘ఫిదా’లో తెలంగాణ యాసతోనూ ఆకట్టుకుంది. ఆంధ్రా అమ్మాయిలే తెలంగాణ యాసను పట్టుకోవడం కష్టమంటే.. తెలుగేతర భాషకు చెందిన అమ్మాయి చక్కగా డబ్బింగ్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
కానీ హిందీలో మాత్రం ఈ నైపుణ్యాన్ని చూపించలేకపోయింది సాయిపల్లవి. హిందీ డైలాగులు సహజంగా లేవని.. దీంతో ఈ పాత్రతో కనెక్ట్ అవడం కష్టమైందని ఆమె మీద విమర్శలు గుప్పించారు హిందీ ఆడియన్స్. ఈ ఫీడ్ బ్యాక్ చూసి భయపడిపోయిన సాయిపల్లవి తన తర్వాతి హిందీ చిత్రానికి డబ్బింగ్ చెప్పుకోకూడదని నిర్ణయించుకుందట. అది ఆషామాషీ సినిమా కాదు. సాయిపల్లవి ‘రామాయణ’లో సీత పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రలో డబ్బింగ్ అటు ఇటు అయితే పాత్ర చెడిపోవడంతో పాటు సినిమా మీదా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే ఆమె, మేకర్స్ కలిసి తన పాత్రకు వేరే అమ్మాయితో డబ్బింగ్ చెప్పించాలని ఫిక్సయినట్లు సమాచారం.