కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్న పొదుపు మంత్రాన్ని రాష్ట్రాలు కూడా స్వీకరించిన దరిమిలా.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కూడా పొదుపు చర్యలు పాటిస్తోంది. దీనిలో భాగంగా కేవలం ప్రభుత్వానికే కాకుండా.. పార్టీ కార్యక్రమాలకు కూడా పొదుపును వర్తింప చేస్తున్నారు. ఈ నెల 27-29 వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడుకు కూడా పొదుపు మంత్రం పఠించారు. దీనిని ఆన్‌లైన్ వేదికగా నిర్వహించాలని తాజాగా సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా ఈ ఆన్‌లైన్ మహానాడును నిర్వహించాలని తీర్మానం చేశారు.
అంతేకాదు.. మూడు రోజుల పాటు నిర్వహించే మహానాడును కేవలం రెండు రోజులకు మాత్రమే పరిమితం చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు.. ఎక్కడివారు అక్కడే క్లస్టర్ల వారీగా ఈ మహానాడుకు హాజరు కావాలని సూచించారు. ఎవరూ తమ తమ జిల్లాల సరిహద్దులు దాటుకుని పార్టీ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కేవలం గుంటూ రు, ఎన్టీఆర్ జిల్లాలు.. లేదా 40-50 కిలో మీటర్ల పరిధిలో(పార్టీ కేంద్రకార్యాలయానికి) ఉండే వారు మాత్రమే పార్టీ కార్యాలయానికి రావాలన్నారు.
అయితే.. పొలిట్ బ్యూరో , రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకత్వానికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆయా కమిటీల్లో ఉన్నవారు మాత్రం మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమానికి రావాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల వారు ఆన్‌లైన్ లోనే మహానాడులో పాల్గొనాలని.. అక్కడి నుంచే ప్రసంగించాలని సూచించారు. ఇక, విందు వినోదాల విషయంలోనూ కోత పెట్టారు. మెనూను కూడా తగ్గించారు. తద్వారా నూనెలను పొదుపు చేయొచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. క్లస్టర్ల వారీగా జరిగే మహానాడులో కేవలం టీ, టిఫిన్లకు మాత్రమే పరిమితం చేయాలన్నారు.
ఇలా.. రెండోసారి..
మహానాడును ఆన్‌లైన్ వేదికగా నిర్వహించడం ఇది రెండోసారి. కరోనా సమయంంలో 2020లో మహానాడును ఇలా.. ఆన్‌లైన్ వేదికగానే నిర్వహించారు. దీంతో అప్పట్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇళ్ల నుంచే నాయకులు ట్యాబులు, ల్యాప్‌టాప్‌ల ద్వారా ఈ మహానాడులో పాల్గొన్నారు. ఇప్పుడు మాత్రం పార్టీ కార్యాలయాలు, కస్టర్ల్ వారీగా స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. తాజాగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ మహానాడును ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.