తమిళనాడు(Tamil Nadu) రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. దళపతి జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అక్కడ సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విజయ్.. ఇప్పుడు అసెంబ్లీలోనూ తన పవర్ చూపించి సీఎం సీట్లో కూర్చున్నారు. ఈ క్రమంలోనే ఆయనను కలిసేందుకు విపక్షాలు, ఇతర రాష్ట్రాల నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికార పార్టీ టీడీపీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. సీఎం విజయ్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన మేనల్లుడు, పారిశ్రామికవేత్త ఎస్. రామిరెడ్డితో కలిసి వెళ్లి ఆయన విజయ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఇరు రాష్ట్రాల్లోనూ ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్‌ను మాగుంట శ్రీనివాసులు రెడ్డి(Magunta Srinivasulu Reddy) శాలువాతో సత్కరించి, బొకే అందజేస్తున్న విజువల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే అసెంబ్లీలో మే 13న జరిగిన బలపరీక్షలో విజయ్ సర్కార్ 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన కొద్దిరోజుల్లోనే విజయ్ పాలనపై తనదైన ముద్ర వేస్తుండటంతో.. ఈ క్రేజీ కాంబినేషన్ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.
విజయ్(CM Vijay)ను మాగుంట కలవడంతో.. ఏపీ-తమిళనాడు రాజకీయాల మధ్య ఏమైనా కొత్త లింకులు కుదురుతున్నాయా? అనే చర్చ మొదలైంది. అయితే ఈ భేటీ వెనుక ఎలాంటి పొలిటికల్ యాంగిల్ లేదని మాగుంట వర్గం క్లారిటీ ఇచ్చింది. ఇదంతా కేవలం మర్యాదపూర్వక కలయిక మాత్రమేనని స్పష్టం చేసింది. అయితే మాగుంట కుటుంబానికి దశాబ్దాలుగా చెన్నై కేంద్రంగా భారీ వ్యాపారాలు ఉన్నాయి. తమిళనాడులోని రాజకీయ, సినీ రంగ ప్రముఖులతో వారికి ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. ఈ పరిచయాల నేపథ్యంలోనే.. పొరుగు రాష్ట్రంలో సరికొత్తగా కొలువుదీరిన ప్రభుత్వ అధినేతను కలిసి, మర్యాదపూర్వకంగా అభినందనలు తెలిపినట్లు సమాచారం.