బాబుతో బాలినేని భేటీ.. ఆ సీక్రెట్ డీల్ కోస‌మేనా?

admin
Published by Admin — May 19, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు అనే మాటను నిజం చేస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లా పాలిటిక్స్‌లో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నిన్నటివరకు వైసీపీలో జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తమిత్రుడిగా, బంధువుగా ఉండి.. ఇటీవల జనసేన గూటికి చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హఠాత్తుగా అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గతంలో టీడీపీపై, ముఖ్యంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన బాలినేని.. ఇప్పుడు అదే చంద్రబాబుతో సానుకూల వాతావరణంలో చర్చలు జరపడం వెనుక సీక్రెట్ డీల్ ఉందనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జోరందుకుంది.

వైసీపీని వీడి జనసేనలో చేరినప్పటికీ బాలినేనికి క్షేత్రస్థాయిలో గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఒకవైపు ఒంగోలు జనసేనలోని పాత నాయకత్వం ఆయన రాకను జీర్ణించుకోలేకపోతుంటే.. మరోవైపు కూటమిలోని బలమైన నేత, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌తో బాలినేనికి ఉన్న పాత శత్రుత్వం ఇరు వర్గాల మధ్య తీవ్ర అంతర్గత విభేదాలకు దారితీసింది. కూటమి కేడర్ నుంచి ఎదురవుతున్న ఈ తీవ్ర వ్యతిరేకతను తట్టుకుని, రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకే బాలినేని నేరుగా చంద్రబాబు(Chandrababu)ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన-టీడీపీ శ్రేణుల మధ్య ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకే ఈ భేటీ జరిగిందని పైకి చెప్తున్నా.. దీని వెనుక అసలు వ్యూహం వేరే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

నాయకుల మధ్య జరిగిన అంతర్గత చర్చల ప్రకారం.. ఒంగోలు రాజకీయాల నుంచి బాలినేని సైడ్ అవ్వడానికి సిద్ధపడినట్లు సమాచారం. దామచర్ల జనార్ధన్‌తో విభేదాల నేపథ్యంలో ఒంగోలులో వేలు పెట్టకుండా.. రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)ను దృష్టిలో పెట్టుకుని వేరే సేఫ్ నియోజకవర్గం గురించి చంద్రబాబుతో బాలినేని చర్చించారని టాక్. భవిష్యత్తులో తనకు, తన వర్గానికి పొలిటికల్ గ్యారెంటీ ఇచ్చేలా ఒక సీక్రెట్ డీల్ కుదిరినందుకే బాలినేని బాబును క‌లిసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నారు. ఏది ఏమైనా, జగన్ నీడలా ఉండి.. నేడు బాబుతో డీల్స్ మాట్లాడే స్థాయికి బాలినేని(Balineni Srinivasa Reddy) రాజకీయ ప్రస్థానం మారడం ఏపీ పాలిటిక్స్‌లోనే ఒక బిగ్ ట్విస్ట్.

Tags
Balineni Srinivasa Reddy CM Chandrababu Naidu AP Politics Ongole Politics JanaSena TDP Ap News Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News